బిల్లులు ఎలా ఆమోదించుకోవాలో.. ఎలా ప్రజామోదం సంపాదించాలో.. తెలంగాణను చూసి నేర్చుకోవాలని మంత్రి కేటీఆర్ పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి సలహాలిస్తున్నారు. కేంద్రం వివాదాస్పదంగా ఆమోదించిన వ్యవసాయ బిల్లుల విషయంలో కేటీఆర్ స్పందన.. అంతే ఉంది. తాము రెవిన్యూ బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింపచేసుకున్నామని .. వెంటనే ప్రజలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకున్నారని గుర్తు చేశారు. తాము రైతు స్నేహపూర్వక రెవెన్యూ బిల్లును ప్రవేశపెట్టామని కేటీఆర్ అన్నారు. కానీ కేంద్రం ఆమోదించిన వ్యవసాయ బిల్లు విషయంలో సంబరాలు ఎక్కడ జరుగుతున్నాయని ప్రశ్నించారు. రైతులకు మేలు చేస్తే..వారు ఎందుకు సంతోషంగా లేరని ప్రశ్నించారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎందుకు రాజీనామా చేస్తున్నాయని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కేటీఆర్ వాదనలో పస ఉంది. నిజంగానే…కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉపయోగడపేలా బిల్లులు తెచ్చినప్పుడు ..దానిపై ప్రజల్లో విస్తృతమైన చర్చ జరిగేలా చూసుకోవాలి. అప్పుడే..అందులో ఉన్న మంచీ చెడ్డపై అందరికీఅవగాహన వస్తుంది. అయితే వ్యవసాయ బిల్లు విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీక్రెట్‌గా వ్యవహరించింది. ఆ బిల్లు వల్ల రైతులకుఎలా లాభం కలుగుతుందో చెప్పలేకపోయారు. వ్యవసాయ మార్కెట్లను నిర్వీర్యం చేయడం ఖాయమన్న అభిప్రాయం ఏర్పడింది. కార్పొరేట్లకు దోచి పెడతారన్న చర్చ కూడా నడుస్తోంది. అలాగే మద్దతు ధర ఇవ్వరని కూడా చెబుతూ వస్తున్నారు. వీటన్నింటిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుండా..రైతులు ఇక ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నారు. ఇప్పటి వరకూ రైతులు ఎక్కడైనా అమ్ముకునే వెసులుబాటు ఉంది. కొత్తగా ఇచ్చేదేమీలేదు.
కానీ రైతులు ఎక్కడకు తీసుకెళ్లి అమ్ముకుంటారు..?. కొత్తగా రీటైల్ బిజినెస్‌లు పెట్టుకునే కార్పొరేట్లకే అమ్ముకోవాలి. తెలంగాణ సర్కార్ రెవిన్యూ విషయంలో రెండేళ్ల నుంచి చర్చ ప్రజల్లో జరిగేలా చేసింది. అలా చేసి.. వారి ఇబ్బందుల్ని గుర్తించి.. పూర్తిగా కాకపోయినా ఎంతో కొంత ఇబ్బందులు తొలగుతాయనే భావనను కొత్త బిల్లు ద్వారా తెచ్చారు. అందుకే ఉద్యోగుల్లోనూ వ్యతిరేకత రాలేదు. ఆ ఉద్దేశంతోనే కేటీఆర్ అలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.