తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అధికార పార్టీ తెరాస సిద్ధమైన సంగతి తెలిసిందే. కొన్నాళ్లు పాలనకు అవకాశం ఉన్నా… ప్రభుత్వాన్ని రద్దు చేశారు సీఎం కేసీఆర్. 105 మంది అభ్యర్థులను కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ దిన పత్రికకు మంత్రి కేటీఆర్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధికి ప్రతిపక్షాలు కలిగిస్తున్న విఘాతమే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న కారణంగా ఆయన చెప్పారు! ఎప్పుడు ఎన్నికలు జరిగినా తాము గెలిచి తీరతామన్నారు. ఇక, అభ్యర్థులూ ఆశావహుల అంశానికి వచ్చేసరికి… తెరాస గెలిచే పార్టీ కాబట్టి టిక్కెట్ల కోసం పోటీ పడేవారు చాలామంది ఉంటారన్నారు. అయితే, ఇప్పటికే ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో కొందరిపై పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమౌతున్న అంశానికి వచ్చే సరికి.. మంత్రి కేటీఆర్ సూటిగా సమాధానం చెప్పలేదు!
సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనమేననీ, పార్టీ పెట్టిన దగ్గర్నుంచీ పాలనలో నిర్ణయాలు వరకూ అన్నీ సంచలనాలే అన్నారు! ఆఖరికి ప్రభుత్వాన్ని రద్దు చేయడం కూడా కేసీఆర్ తీసుకున్న సంచలన నిర్ణయంగా కేటీఆర్ చెప్పారు. మళ్లీ అభ్యర్థులను ప్రకటించినా… అది కూడా సంచలనమే అవుతుందన్నారు! ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులందరికీ బీ ఫామ్ ఇస్తారా అనే ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పకుండా… అది పార్టీ అధ్యక్షుడు చెప్పాల్సిన మాట అనీ, అభ్యర్థులను ప్రకటించింది ఆయనే కాబట్టి మార్పులూ చేర్పులూ లాంటివి ఉంటే ఆయనే చెప్పాలి అన్నారు. సీట్లు దక్కనివారికి అసంతృప్తి ఉండటం సహజమేనని మంత్రి కేటీఆర్ చెప్పారు.
ప్రకటించిన తెరాస అభ్యర్థుల జాబితాలో మార్పులు ఉండే అవకాశాలు లేవని కచ్చితంగా తెగేసినట్టుగా మంత్రి కేటీఆర్ చెప్పలేదు. కేసీఆర్ నిర్ణయాలు ఏవైనా సంచలనాలే అన్నారు! అంటే, అభ్యర్థుల మార్పులు కూడా సంచలన నిర్ణయంగా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చినట్టుగా మాట్లాడారు. అభ్యర్థుల్ని ప్రకటించింది ముఖ్యమంత్రే కాబట్టి, మార్పులూ చేర్పులూ ఉంటే ఆయనే ప్రకటిస్తారన్న అభిప్రాయంలోనూ సంకేతాలున్నాయి! అసెంబ్లీ రద్దు ప్రకటనకు ముందు చేయించుకున్న పలు సర్వేల్లో కొంతమందిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నట్టుగానే తేలినట్టు కథనాలు వచ్చాయి. అయితే, ఆ అసంతృప్తులను ఎన్నికల నోటిషికేషన్ వచ్చే వరకూ బిజీబిజీగా ఉంచాలన్న వ్యూహంలో భాగంగానే… వారికీ టిక్కెట్లు ప్రకటించేశారు అనే అభిప్రాయం వ్యక్తమైంది. దానికి అనుగుణంగానే మార్పులు ఉంటాయనే కథనాలు వచ్చాయి. ఇప్పుడు వాటికి బలం చేకూరుస్తున్న విధంగానే కేటీఆర్ వ్యాఖ్యలూ ఉన్నాయని చెప్పుకోవచ్చు.