కాంగ్రెస్ ఎల్పీ విలీనంపై తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ఈ ప్రక్రియలో ఏదైనా చట్ట విరుద్ధంగా, లేదా రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే ఎవరైనా ప్రశ్నించవచ్చన్నారు. కాంగ్రెస్ శాసన సభాపక్షంలోని మూడింట రెండు వంతుల మిత్రులు… తెరాస ఎల్పీలో కలిసేందుకు సిద్ధపడ్డారన్నారు. వారు కోరిన వెంటనే తెరాస శాసన సభా పక్ష నాయకుడు ఆమోదం తెలిపారనీ, కాబట్టి విలీనానికి తాను కూడా అనుమతిస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రకటించారన్నారు. కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే తాము చాలా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించామన్నారు!
గతంలో తెరాస సభ్యులను లాక్కున్న విధానాన్ని ఒక్కసారి గమనిస్తే… ఇప్పుడు తాము అనుసరించిన వైఖరి ఎంతో మర్యాద పూర్వకంగా ఉన్నట్టు లెక్క అన్నారు కేటీఆర్. ఈ పార్టీ ఫిరాయింపులు రాజ్యంగ విరుద్ధంగా జరిగి ఉంటే, దానికి సంబంధించిన వేదికలున్నాయనీ, కోర్టుకు వెళ్తామని ఇప్పటికే కాంగ్రెస్ వారూ ప్రకటించి ఉన్నారనీ, ఏం జరుగుతుందో వేచి చూద్దామన్నారు. తెరాసకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరతామని ముందుకొస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్దంటారా అని ప్రశ్నించారు. అలాగే, తెరాసలోకి వచ్చి చేరతామని ముందుకు వస్తున్నవారిని ఎందుకు వద్దంటామన్నారు. పార్టీలో చేర్చుకున్నాక టీడీపీ నుంచి గెలిచిన రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించారా, అలాంటప్పుడు తెరాసలో చేరినవారిని రిజైన్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేయడం సరికాదన్నారు!! తెలంగాణలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ వద్దు అని ప్రజలే వరుస ఎన్నికల్లో తీర్పులు ఇస్తున్నారని గుర్తు చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ఎల్పీ విలీనాన్ని కేటీఆర్ బాగానే సమర్థించుకున్నారు. అయితే, నిపుణులు చెబుతున్నమాట ఏంటంటే.. మూడింట రెండొంతులు మెజారిటీ ఉన్నా, ఆ పార్టీ అనుమతి లేకుండా ఆ పార్టీకి చెందిన శాసన సభాపక్షాన్ని ఇంకో పార్టీలోకి ఎలా విలీనం చేస్తారన్నది ప్రశ్న..? ఉదాహరణకు ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని గుర్తు చేసుకుంటే… ఆ పార్టీ తీర్మానించిన తరువాత సభ్యులతో సహా కాంగ్రెస్ లో విలీనమైంది. ఇప్పుడు, తెలంగాణలో కేవలం కాంగ్రెస్ శాసన సభాపక్షం ఒక్కటే తెరాసలో విలీనం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ కాదు కదా! అంటే, ఒక పార్టీ వేరు… ఆ పార్టీకి చెందిన శాసనసభా పక్షం వేరు అనేది ఉండదు కదా! శాసన సభా పక్షం విలీనానికి సంబంధించి రాజ్యాంగంలో ఉన్న వెసులుబాటును రాజకీయ పార్టీలు వేరే రకంగా అర్థం చేసుకుంటున్నాయనే అభిప్రాయమూ కొంతమంది నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఏదైమైనా, ఈ వ్యవహారం ఎలాగూ కోర్టుకు వెళ్తుంది. దీనిపై మరింత స్పష్టత అక్కడే వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి, ఫిరాయింపులు అనేవి అన్ని పార్టీలూ చేస్తున్న పనే అన్నట్టుగా.. దాన్నొక సహజ స్వభావంగా నిర్వచించే ప్రయత్నం కేటీఆర్ చేశారు. ఈ క్రమంలో ప్రజాతీర్పు మాటేంటి, దానికున్న విలువ ఎంత అనే ప్రశ్నలు… ఎప్పటికీ ప్రశ్నలుగానే ఉంటున్నాయి..!