ఫార్ములా ఈ రేసు కేసులో అసలు అవినీతి లేదు కాబట్టి హైకోర్టు ఎఫ్ఐఆర్ను కొట్టి వేస్తుందని.. ఆ ఎఫ్ఐఆర్ను కొట్టి వేస్తే అసలు ఈడీ కేసు కూడా చెల్లదని మాజీ మంత్రి కేటీఆర్ నమ్మకంతో ఉన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడినప్పుడు ఆయన తనకు ఈడీ నోటీసులు అందాయని ఒప్పుకున్నారు. ఇతర కేసుల కన్నా ఈ కేసులోనే ఎక్కువ హడావుడి చేస్తుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అయితే విచారణకు వెళ్తారా లేదా అన్నదానిపై మాత్రం భిన్నంగా స్పందించారు.
ఇది తప్పుడు కేసు కాబట్టి హైకోర్టు ఎఫ్ఐఆర్ను క్వాష్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ కేసులు పెట్టింది కాబట్టి అప్పుడు ఆ కేసు చెల్లుతుందా లేదా అన్నది చూడాలంటున్నారు. నిజానికి ఏసీబీ కేసు ఆధారంగానే ఈడీ కేసు పెట్టినప్పటికీ.. రెండు కేసుల స్వభావం పూర్తిగా వేరు. కేటీఆర్ అవినీతి చేశారా లేదా అన్నది ఈడీ కి సంబంధం లేదు. కేవలం నగదు అక్రమ చెలామణి, ఫెమా చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డారా లేదా అన్నది మాత్రమే ఈడీ చూసుకుంటుంది. ఈ ప్రకారం చూస్తే అక్రమంగా నగదు విదేశాలకు తరలిపోయిందనేది ప్రాథమికంగా కళ్ల ముందు ఉన్న నిజం. డబ్బులు పంపామని కేటీఆర్ అంటున్నారు. అయితే రూల్స్ పాటించాల్సింది బ్యాంకేనని ఆయన అంటున్నారు.
అయితే అసలు హైకోర్టు కేటీఆర్ పై కేసును క్వాష్ చేసే అవకాశాలు ఎంత ఉన్నాయన్నది కూడా న్యాయవర్గాలు అంచనా వేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి కూడా తెచ్చుకున్నారు. విచారణ కొనసాగించవచ్చని హైకోర్టు కూడా వాయిదా సందర్భంగా చెప్పింది. అరెస్టు చేయకుండా ఏమైనా ఉపశమనం కల్పిస్తారేమో కానీ.. క్వాష్ చేయడం ఉండకపోవచ్చని సీనియర్ లాయర్లు అంచనా వేస్తున్నారు. ఏడో తేదీన కేటీఆర్ ఈడీ ఎదుటకు వెళ్లాల్సిన అవసరమే ఎక్కువ పడవచ్చని భావిస్తున్నారు.