కేంద్ర ప్రభుత్వం … ప్రభుత్వ రంగ సంస్థల ను అమ్మేస్తోంది. అవన్నీ లాసుల్లో ఉన్నాయన్న కారణాలు చూపిస్తున్నారు. అయితే చాలా ప్రభుత్వ రంగ సంస్థల భూములు అత్యంత ఖరీదైనవిగా మారాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను భూములతో సహా అమ్ముతారో లేదో తెలియదు కానీ.. భూముల విలువ రెండు లక్షల కోట్లకుపైగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలోనూ పలు సంస్థలను అమ్మకానికి పెడుతున్నారు. ”హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా అమ్ముతోంది.
ఈ పరిశ్రమలకు అత్యంత ఖరీదైనభూములు ఉన్నాయి. ఈ ఆరు సంస్ధలకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో దాదాపు 7,200 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి విలువ కనీసం 5 వేల కోట్లపైగా, బహిరంగ మార్కెట్లో40 వేల కోట్లపైగా ఉంటుందని అంచనా. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించి, తెలంగాణ సర్వతోముఖాభివఅద్ధికి ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు.
అసలు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మే ప్రయత్నాలపై పునరాలోచన చేయాలన్నారు. లేకపోతే ప్రభుత్వం ఇచ్చిన భూములను ప్రభుత్వానికి ఇచ్చేయాలని అంటున్నారు. కేటీఆర్ డిమాండ్ సహేతుకంగానే ఉందన్న అభిప్రాయం ఇ ఎక్కువ మందిలో వినిపిస్తోంది.