కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించి ప్రజలు ఏం కోల్పోయారో తెలుసుకున్నారని అందుకే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తోందని చెబుతున్నారని భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ తమ పార్టీ కార్యకర్తలకు చెప్పారు. ఎర్రబెల్లి నియోజకవర్గం పాలకుర్తికి చెందిన శ్రీనివాసరెడ్డి అని సినీ నిర్మాత బీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపించారు. ఆయనతో కలిసి పార్టీ కార్యకర్తలను తీసుకుని ఎర్రబెల్లి దయాకర్ రావు ఫామ్ హౌస్కు వెళ్లారు. అక్కడ పార్టీలో చేరిక కార్యక్రమాలు ముగిసిన తర్వాత కేసీఆర్ వారిని ఉద్దేశించి మాట్లాడారు.
అధికారంలో ఉంటే కత్తులు తిప్పి యుద్దాలు చేస్తామంటున్నారని చంఢాలపు మాటలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఇచ్చిన దాని కన్నా 90 శాతం అమలు చేశామన్నారు. అది చేస్తామని, ఇది చేస్తామని తాము పెద్ద పెద్ద మాటలు చెప్పగలమని, కాని నేల విడిచి సాము చేయలేదని ప్రజలకు వాస్తవాలే చెప్పామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో చెప్పినవే చేశామని కేసీఆర్ నేతలతో స్పష్టం చేశారు.
తమ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం లాగా రాగానే కత్తులు తిప్పుతాం.. యుద్దాలు చేస్తామని, కూలగొడతామని చెప్పలేదన్నారు. ప్రజల కోసమే పని చేసిందన్నారు. ప్రజలకు సేవ చేయడానికే ఇలాంటి బాద్యతలు ప్రజలు అప్పగించాలని నేతలు గుర్తెరగాలన్నారు. ఒక వ్యక్తి కోసం, ఓట్ల కోసం ప్రభుత్వాలు పని చేయకూడదన్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇలా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడటంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.