జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరిపోవడంతో అక్కడి క్యాడర్ కు ధైర్యం ఇచ్చేందుకు కేటీఆర్ కార్యకర్తల సమావేశం పెట్టారు. దమ్ముంటే పదవికి రాజీనామా చేయాలని సవాల్ చేశారు. తాను కవితక్కతో కలిసి ఇంటింటికి తిరిగి బీఆర్ఎస్ ను గెలిపిస్తామని.. కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రకటించారు. రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే పార్టీలో చేరిన వారితో రాజీనామాలు చేయించి ఉపఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు.
గతంలో పదేళ్లలో మీరు చేసిందేమిటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు కాబట్టి దానికో సమాధానాన్ని కేటీఆర్ కనుగొన్నారు. అసలు ఫిరాయింపులు ప్రారంభించింది ఇందిరాగాంధీ అని అంటే కాంగ్రెస్ దే అసలు పాపం అని చెప్పకనే చెప్పేశారు. హర్యానాలో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను గుంజుకున్నది.. ఇందిరా గాంధీ. అలా పార్టీ ఫిరాయింపుల సంస్కృతి తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని చరిత్ర చెప్పుకొచ్చారు. తమ పార్టీలో ఒక్కొక్కరు చేరలేదని.. మూడింటి రెండు వంతుల మంది వచ్చి విలీనమయ్యారని అది రాజ్యాంగబద్దమని చెప్పుకొచ్చారు. కానీ రేవంత్ ఒక్కొక్కరికి కండువా కప్పుతున్నారని ఆరోపించారు.
సంజయ్ కుమార్ వియ్యంకుడికి బిల్లులు రావాల్సిఉందని .. ఆయన క్రష్ ఆగొద్దని పోయాడని.. తప్ప మరో కారణం లేదన్నారు. జగిత్యాలకు పట్టిన శని పోయిందని ఈ నియోజకవర్గ ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని విమర్శించారు. ఉపఎన్నికల చాలెంజ్ కేటీఆర్ చేయడంతో కాంగ్రెస్ క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ఎమ్మెల్యే చనిపోవడం వల్ల వచ్చిన కంటోన్మెంట్ ఉపఎన్నికలో సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కోల్పోయింది.. కాంగ్రెస్ గెలిచింది.