మూసీ ప్రక్షాళనకు కేసీఆర్ ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దానికి ఛైర్మన్గా ఫిరాయింపు ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని నియమించారు. కానీ చేసిన పనులేమీ లేవు. ఇప్పుడు మూసీ ప్రక్షాళనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు మూసి ప్రక్షాళన ముందుకు తీసుకెళ్లలేదో చెప్పారు. ఎందుకంటే పేద ప్రజల ఇళ్లు కూలగొట్టడం ఇష్టం లేదని కేసీఆర్ ముందుకెళ్లలేదట. అంటే నదుల్ని ఆక్రమించుకుని పేదలు ఇళ్లు కట్టుకుంటే వారిని ఖాళీ చేయించడం ఇష్టం లేక ఆ నదుల్ని వారికి వదిలేస్తారన్నమాట.
నిజానికి గతంలో కేటీఆర్ మూసి ప్రక్షాళన విషయంలో కఠినంగా వ్యవహరించారు. ఎవరి ఇళ్లు ఉన్నా నిర్దాక్షిణ్యంగా కూల్చేయాలని ఆదేశాలిచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా ఇప్పుడు కేటీఆర్ భిన్నంగా స్పందిస్తున్నారు. తాము ప్రక్షాళన చేయకపోవడానికి కారణం పేదలేనని చెబుతున్నారు. అయితే మూసి ప్రక్షాళన కార్పొరేషన్ కు చైర్మన్ గా కూడా పని చేసిన సుధీర్ రెడ్డి మాత్రం.. డబ్బుల్లేక కేసీఆర్ పట్టించుకోలేదని.. మూసీ పేరుతో వెయ్యి కోట్లు అప్పు తెచ్చారు కానీ వాటితో కూడా పనులు చేయించలేదని చెప్పారు.
ఓ వైపు రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన ఆగే సమస్యే లేదని పేదలందరికీ ఇళ్లు ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి మార్గాలను కూడా చూపిస్తామని అంటున్నారు. మూసిని ప్రక్షాళన చేసి హైదరాబాద్ ను ముంబు బారి నుంచి కాపాడుతామని అంటున్నారు. అయితే కేటీఆర్ మాత్రం.. పేదల్ని ఖాళీ చేయిస్తే ఊరుకునేది లేదని ఉద్యమం చేస్తామని అంటున్నారు.