దక్షిణాది రాష్ట్రాలంటే కేంద్రంలోని భాజపా సర్కారుకి చిన్నచూపు అంటూ ఎన్నికల ముందు ఓ చర్చ ప్రచారంలో ఉండేది. ఆ తరువాత, ఆ టాపిక్ మరుగునపడిపోయింది. భాజపాని ఆ పాయింటాఫ్ వ్యూలో విమర్శలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేకుండా పోయిందనాలి! ఇవాళ్ల, హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం మానేసిందనీ, దానికి రాజకీయ కారణాలే తప్ప మరొకటి కాదన్నారు. పోటీపడి ఎదుగుతున్న రాష్ట్రాలకు ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావించకపోవడం దురదృష్టకరం అన్నారు. బులెట్ రైలు అంటే ఢిల్లీ ముంబైలకే పరిమితమా… దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలూ నగరాలు వారికి గుర్తుకురావా అంటూ ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టంతా ఎప్పుడూ నాగ్ పూర్ అభివృద్ధి, గుజరాత్ ల మీద మాత్రమే ఉంటుందన్నారు. రక్షణ రంగంలో హైదరాబాద్ కి మంచి గుర్తింపు ఉందని కేంద్రం మరచిపోయిందని విమర్శించారు. డిఫెన్స్ కారిడార్ ని హైదరాబాద్ – బెంగళూర్ ల మధ్య ఏర్పాటు చేయకపోవడం సరైన విధానం కాదన్నారు. కేంద్రం వివక్ష కారణంగానే రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయనీ, వీటి కోసం కేంద్రమంత్రుల్ని కలిసి విజ్ఞప్తులు చేస్తున్నా ప్రయోజనం లేకుండాపోయిందన్నారు. దక్షిణాది రాష్ట్రాలపైన కేంద్రం ఈ తరహా వైఖరిని అనుసరించడం సరైంది కాదనీ, రాష్ట్రాలకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత వారికి ఉంటుందన్నారు.
ఈ మధ్య కాలంలో కేంద్రంలోని భాజపా సర్కారుపై ఇంతగా విమర్శలు చేసింది లేదు. కేంద్రంతో మంచి సంబంధాలు నెరిపేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దాదాపుగా ప్రయత్నిస్తూ ఉంటారు. రాష్ట్రంలో భాజపా నేతలు ఎంతగా విమర్శలు చేస్తున్నా… వాటిని తీవ్రంగా తిప్పికొట్టేందుకు తెరాస తీవ్రంగా ప్రయత్నించిందీ ఈ మధ్య చూడలేదు. ఒకటైతే వాస్తవం… రాష్ట్రంలో ఇప్పుడు భాజపా ఎదగాలని ప్రయత్నిస్తోంది. అది కూడా ఎలా… కేంద్రంలోని అధికారాన్ని ప్రాతిపదికగా చేసుకుని. ఈ క్రమంలో, కేంద్రమే ఫలానాది అభివృద్ధి చేసిందని చెప్పుకోవడానికి వీలున్న అంశాలపై మాత్రమే భాజపా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోంది. పొలిటికల్ మైలేజ్ రాదు అనుకుంటే… ఆయా రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో ఎప్పట్నుంచో తెలిసిందే. ఆ కోవలో తెలంగాణ మినహాయింపు కాదు, గత ఐదేళ్లలో కూడా జరిగింది ఇదే.
అయితే, ఇప్పుడే ఎందుకు తెరాస తీవ్రంగా ప్రశ్నించడం మొదలుపెట్టింది..? గడచిన ఐదేళ్లలో భాజపా ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షం కాదు. కానీ, రాబోయే ఐదేళ్లలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో… భాజపాపై ఇవాళ్ల తెరాస ఘాటు విమర్శలు మొదలుపెట్టడానికి కూడా వీళ్లకి ఉండాల్సిన రాజకీయ కారణాలు వీరికీ ఉన్నాయి కదా. రాజకీయ అవసరాలను బట్టే పాలన సాగిస్తున్న పార్టీలు అధికారంలో ఉంటే…. అభివృద్ధి జరగకపోవడం వెనక రాజకీయ కారణాలు కాకపోతే ఇంకేముంటాయి?