కరోనా విషయంలో ప్రజల కష్టాలను దూరం చేసే టాస్క్‌ను కేసీఆర్ అప్పగించడంతో కేటీఆర్ ఫుల్ టైం.. దానికే కేటాయిస్తున్నారు. ప్రధానంగా రెండు సమస్యలను కేటీఆర్ గుర్తించారు. అందులో ఒకటి… వ్యాక్సిన్. రెండోది రెమిడెసివర్ ఇంజక్షన్లు. వ్యాక్సిన్ల విషయంలో గ్లోబల్ టెండర్లకు వెళ్లడం మినహా ఇప్పుడు చేయగలిగిందేమీ లేదని కేటీఆర్ డిసైడ్ అయ్యారు. వెంటనే.. గ్లోబల్ టెండర్ల ప్రక్రియ ప్రారంభించమని ఆదేశాలిచ్చారు. ఇక రెమిడెసివర్ ఇంజక్షన్ల లభ్యతపై ఫుల్ ఫోకస్ పెట్టారు. నిజానికి ఇప్పుడు రోగులకు ప్రాణదాతగా రెమిడెసివర్ ఇంజక్షన్లు మారాయి. యాంటీ వైరల్ డ్రగ్ కావడం.. బాగా ఖరీదు కావడంతో గతంలో వాడకం తక్కువగా ఉండేది.
ఉత్పత్తి.. వేల వయల్స్లోనే ఉండేది. కానీ ఇప్పుడు.. పరిస్థితి విషమించిన కరోనా రోగులకు.. ఆ రెమిడెసివర్ ఇంజెక్షన్లు బాగా పని చేస్తున్నాయి. దీంతో అందరూ.. దానిపైనే ఆధారపడుతున్నారు. స్టెరాయిడ్ కావడంతో ఉత్పత్తికి ఎగుమతికి అనేక ఆంక్షలు ఉంటాయి. ఇప్పుడు వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు కేటీఆర్ ఫోకస్ పెట్టారు. ప్రముఖ ఫార్మా కంపెనీల ప్రతినిధులందర్నీ ప్రగతి భవన్‌కు పిలిపించి.. పరిస్థితిని వాకబు చేశారు. కేటీఆర్ నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ టీం సభ్యులందరూ ఇందులో పాల్గొన్నారు. వారందరూ.. రెమిడెసివర్ ఇంజక్షన్లకు లోటు లేకుండా చూస్తామని.. బ్లాక్ మార్కెట్లో కొనాల్సిన అవసరం లేకుండా సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
అలాగే వ్యాక్సిన్ల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ఏమైనా సహకారాలు కావాలంటే పూర్తి స్థాయిలో కల్పిస్తామని.. తెలంగాణ ప్రభుత్వం ప్రో- యాక్టివ్ గా వ్యవహరిస్తుందని వారికి హామీ ఇచ్చి పంపించారు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యత పక్కాగా నెరవ్చేందుకు… కేటీఆర్.. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నారు. కరోనా పాజిటివిటీ రేట్ విషయంలో తెలంగాణ కాస్త మెరుగైన స్థితిలోనే ఉంది. రోగులకు మెరుగైన సేవలు అందితే మరింత మంచి పేరు వస్తుంది.