తెరాస మీద పోటీకి అన్ని పార్టీలూ ఒకటౌతున్నాయన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి తెలంగాణ సాధించుకున్నాక కేసీఆర్ నాయకత్వంలో జరిగిందన్నారు. కానీ, ఇప్పుడు కేసీఆర్ ను ఓడించేందుకు ఆగర్భ శతృవులైన కాంగ్రెస్, టీడీపీలు కలిశాయన్నారు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పార్టీలు కూడా ఇవాళ్ల ఒకటౌతున్నాయన్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే వారి లక్ష్యం అన్నారు. ఎందుకు గద్దె దించాలి కేసీఆర్ ని.. రూ. వెయ్యి పెన్షన్ ఇస్తున్నందుకా, ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం పెంచినందుకా, ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవం చేయించుకుంటే రూ. 12 వేలు ఇస్తున్నందుకా, రైతులకు రూ. 8 వేలు ఇస్తున్నందుకా అంటూ ప్రజలను ప్రశ్నించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదనీ, తెలుగుదేశం పార్టీకి లీడర్ లేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే… దాన్ని అడ్డుకోవడం కోసం చనిపోయివారి వేలు ముద్రలతో కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టిందన్నారు. ఇదే నిజమని నమ్మితే కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిమి తరిమి కొట్టాలని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా బీజేపీ లీడర్లు ప్రచారానికి వస్తున్నారనీ, మీ ఇంటి కిరాయిలు కడతామని అంటున్నారనీ, అలాంటి మాటల నాయకులతో జాగ్రత్తగా ఉండాలన్నారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నప్పుడు, నల్లధనం మొత్తం బయటకి వచ్చేస్తుందనీ, ఒక్కో పేదవాడినీ రూ. 15 లక్షలు పంచేస్తామని మోడీ చెప్పారన్నారు. ఇప్పుడా సొమ్మును పేదల అకౌంట్లో భాజపా వేస్తే, ఆ పార్టీ నాయకుల ఇళ్లకు తాము కిరాయిలు కడతామని కేసీఆర్ అన్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
కేసీఆర్ కు తగ్గట్టుగానే కేటీఆర్ కూడా మంచి వాక్చాతుర్యంతో ప్రచార సభల్లో మాట్లాడుతున్నారు. అయితే, కాంగ్రెస్, టీడీపీల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలకు మరో అర్థం కూడా ధ్వనిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి కేడర్ లేదన్నారు… ఇదే సమయంలో ముఖ్యమంత్రి పోస్టు కోసం పోటీ పడుతున్నవారు ఉన్నారన్నారు! అంటే, ఆ పార్టీలో లీడర్లు ఉన్నట్టే కదా! అలాగే, తెలంగాణలో టీడీపీకి లీడర్లు లేరన్నారు. అంటే, కేడర్ ఉన్నట్టే చెబుతున్నట్టుగా అనుకోవడానికి ఆస్కారం ఉంది కదా. కేడర్ లేని పార్టీ, కేడర్ ఉన్న పార్టీతో కలిస్తే ప్లస్సే కదా! లీడర్లు లేని పార్టీ, ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్లస్సే అవుతుంది కదా… అనే చర్చకు ఆస్కారం ఇచ్చేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయి. ఈ రెండు పార్టీల పొత్తును బలమైన ప్రత్యర్థిగానే తెరాస భావిస్తోందని చెప్పకనే చెబుతున్నారని భావించొచ్చు కదా!