తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున సొమ్ము పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేశారని ఆరోపించారు. తెలంగాణలోని పత్రికలు, వార్తా ఛానెళ్లలో కోట్ల రూపాయల ఖర్చుతో ప్రకటనలు వేయిస్తున్నారన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము అనీ, ఆ సొమ్ముతో తెలంగాణలో ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఇది సరైన పద్ధతి ఎలా అవుతుందనేది ఎన్నికల కమిషన్ ను తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ ధోరణికి వెంటనే అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే చంద్రబాబు మీద ఒక ఆరోపణ చేశారనీ, రూ. 500 కోట్ల ఖర్చుతో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని బహిరంగ సభలో చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏపీ సీఎంల మధ్య ఈ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతి ద్వారా పెద్ద ఎత్తున సంపాదించిన సొమ్మును కట్టలు గట్టి తెలంగాణకు చేరవేరే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనీ, ఇక్కడి రాష్ట్రంలోని ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడుకుంటున్నారనీ, పోలీసు వాహనాలు.. అంబులెన్సుల ద్వారా సొమ్ము రవాణా చేసి పంపిణీకి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంద్రబాబు నమ్మడం లేదనీ, ఆయనే స్వయంగా డబ్బులు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నానికి ఎలక్షన్ కమిషన్ అడ్డుకట్ట వేయాలనీ, నేతల వాహనాలను తనిఖీ చేయాలని డిమాండ్ చేశారు.
మొత్తానికి, తెరాస ఎన్నికల ప్రచారం, విమర్శలూ ఆరోపణలూ అన్నీ టీడీపీ చుట్టూనే పెరుగుతూ ఉండటం గమనార్హం! మహా కూటమి అధికారంలోకి వస్తే… తెలంగాణ పాలనా పగ్గాలు చంద్రబాబు చేతికే వెళ్లిపోతాయని ఆరోపిస్తున్నారు. కూటమికి ఓటేస్తే ప్రాజెక్టులు ఆగిపోతాయనీ, 24 విద్యుత్ ఆగిపోతుందనీ, రైతుబంధు ఉండదనీ… ఇలా ఇంకోపక్క ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడేమో… స్వయంగా చంద్రబాబే వందల కోట్లు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటారు! అది కూడా నిఘా వర్గాలనూ పోలీసులనూ వాడుకుకొనట! అంటే, ఆయా వ్యవస్థలపై తెరాసకు గౌరవం ఉందా అనే అనుమానాలు కలిగించే విధంగా ఉన్నాయీ వ్యాఖ్యలు. అయినా, రూ. 500 కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పుడు… ఆ సొమ్ము కాంగ్రెస్ కి ఇచ్చి, ఆ పార్టీ విదిల్చిన సీట్లలో పోటీ చేయాల్సిన పరిస్థితి టీడీపీకి ఎందుకు..? ఆ స్థాయిలో ఖర్చు చేద్దామనుకున్నప్పుడు నేరుగా పోటీకి దిగితే ఎక్కువ స్థానాలు వస్తాయేమో కదా..?