తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ కోవిడ్ పేషంట్‌కు కాకినాడలో వెంటిలేటర్ బెడ్ అవసరం అయింది. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించలేదు. చివరికి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. వెంటనే.. కేటీఆర్ స్పందించారు. కాకినాడలోనే వెంటిలేటర్ బెడ్ ఇప్పించారు. ఆ తర్వాత నెల్లూరుకు చెందిన ఓ వ్యక్తి.. తమకు అర్జంట్‌గా రెమిడెసివర్ ఇంజక్షన్లు కావాలని బిల్లు కూడా పోస్ట్ చేసి కేటీఆర్‌కు ట్వీట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. తన ఆఫీస్ సహాయపడుతుందని చెప్పి..ఆయన ఏపీ మంత్రి గౌతంరెడ్డికి ట్యాగ్ చేశారు. ఆ తర్వాత బ్లాక్ ఫంగస్ బాధితుడి బంధువు ఒకరు.. హైదరాబాద్ కోఠీ ఈఎన్టీ ఆస్పత్రిలో చేర్చుకోవడం లేదని.. కాస్త హెల్ప్ చేయాలని ట్వీట్ చేశారు. ఈ సమస్యనూ కేటీఆర్ పరిష్కరించారు. ఆంధ్రుల సమస్యలను కూడా కేటీఆర్ చురుగ్గా పరిష్కరిస్తూండటంతో.. ఆయనకు ట్వీట్ విజ్ఞప్తులు రాను రాను పెరిగిపోతున్నాయి.
తెలంగాణలో ముఖ్యమంత్రి బాధ్యతల్ని మంత్రిహోదాలోనే నిర్వర్తించేస్తున్న కేటీఆర్ .. తనను సహాయం అడిగిన వారికి లేదనకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనను నేరుగా కలవడం ఈ కాలంలో సాధ్యం కాదు. అందుకు ఉన్నఒకే ఒక్క మార్గం సోషల్ మీడియా. ట్విట్టర్లో చురుగ్గా ఉండే కేటీఆర్‌కు.. ఆ మాధ్యమం ద్వారానే ఎక్కువ మంది సహాయంచేయమని అడుగుతున్నారు. కేటీఆర్ కూడా.. అదే చెబుతున్నారు. తనను ట్విట్టర్ ద్వారా సంప్రదించమని అంటున్నారు. ఆయన సోషల్ మీడియా హ్యాండిల్.. వాటికి వచ్చే ఫిర్యాదులు.. విజ్ఞప్తులను ఎప్పటికప్పుడు హ్యాండిల్ చేయడానికి ప్రత్యేకంగా టీమ్‌ను నియమించుకున్నారు.
తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే.. తీరిస్తే పెద్ద విషయం కాదు కానీ.. కేటీఆర్ .. ఆంధ్ర ప్రజల సమస్యసను కూడా పరిష్కరిస్తున్నారు. తన పరిధిలో లేకపోతే.. ఆంధ్ర మంత్రులకు చెప్పి.. పరిష్కరిస్తున్నారు. వేగంగా పనులు అవుతూండటంతో చాలా మంది సమస్యల పరిష్కారం కేటీఆర్.. కేటీఆర్‌కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేయడమే… గొప్ప అవకాశంగా చూసుకుంటున్నారు. అదే .. ఏపీ మంత్రులు ఎవరూ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్‌గా ఉండరు. వారి సోషల్ మీడియా ఖాతాలన్నీ.. ప్రభుత్వ ప్రశంసల పోస్టర్లతో నిండిపోయి ఉంటాయి. అందుకే కేటీఆర్ ఇప్పుడు ఏపీ ప్రజలకు కూడా ఆపద్భాంధవుడిగా మారారు.