కేటీఆర్, హరీష్ రావు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వీరిద్దరూ హస్తినకు చేరుకున్నారు. ఆ విషయం కేటీఆర్ ఫ్లైట్‌లో తనకు ఓ అమ్మాయి కలిసి టిష్యూ పేపర్ మీద అభినందనలు రాసి ఇచ్చిందని ప్రధాని కావాల్సిన అర్హతలు ఉన్నాయని చెప్పిందని సోషల్ మీడియాలో సంతోషపడే వరకూ ఎవరికీ తెలియదు. ఆ ట్వీట్ తర్వాత ఓహో కేటీఆర్ ఢిల్లీ వెళ్లారా అని బీఆర్ఎస్ నేతలు అనుకున్నారు.
గ్రేటర్ పార్టీ నేతల సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేసి కేటీఆర్ ఢిల్లీ వెళ్లడం ఏమిటని కొంత మంది చర్చించుకున్నారు. ఆ బాధ్యతను తలసానికి కేటీఆర్ ఇచ్చారు. కేటీఆర్ తో పాటు హరీష్ కూడా ఢిల్లీకి వెళ్లారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కవితతో ములాఖత్ కోసం వెళ్లి ఉంటారని అనుకున్నారు. కానీ శుక్రవారం ఉదయం ములాఖత్ లో కవితను కలవలేదు. అదే సమయంలో కవిత కస్టడీని పొడిగిస్తూ కోర్టు నిర్ణయం ప్రకటించింది.
కవితతో ఇటీవలి కాలంలో కేటీఆర్, హరీష్ వేర్వేరుగా ములాఖత్ అయ్యారు. ఇప్పుడు ఢిల్లీలో ఏ సమావేశాలు నిర్వహిస్తున్నారో క్లారిటీ లేదు. ఢిల్లీలో గతంలో బీఆర్ఎస్ భవన్ ను నిర్మించారు. అది ఆలస్యం అవుతుందని వేరే భవనం తీసుకుని అందులో కార్యాలయం ప్రారంభించారు. ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఆఫీసు ప్రారంభించాల్సిన అవసరం లేదు. కొత్తగా నిర్మించిన భవనం ఖాళీగానే ఉండిపోయింది. ఈ వ్యవహారంలపై వెళ్లారా లేకపోతే అంతర్గత వ్యవహారాలు ఏమైనా చర్చించడానికి వెళ్లారా అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది.