తన పాలనను ఘోరంగా విమర్శించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఏపీ సీఎం జగన్ దావోస్‌లో భేటీ అయ్యారు. భేటీ వివరాలను మంత్రి కేటీఆరే సోషల్ మీడియాలో పంచుకున్నారు. గొప్ప సమావేశం జరిగిందని చెప్పారు. మర్యాదపూర్వకంగానే కలుసుకున్నారని తెలుస్తోంది. పెట్టుబడుల సదస్సు కోసం తెలంగాణ తరపున కేటీఆర్ ప్రతీ ఏడాది రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ సారి ఏపీ తరపున సీఎం జగన్ తొలి సారి వచ్చారు. ఇద్దరూ దావోస్‌లోనే ఉండటంతో కలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్లతో కేటీఆర్ తీరిక లేకుండా సమావేశం అవుతున్నారు.
జగన్ కూడా పలువురు పారిశ్రామికవేత్తలకు ఏపీలో అవకాశాలను వివరిస్తున్నారు. ఇలాంటి బిజీ టైంలోనూ జగన్ తీరిక చేసుకుని కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఇటీవల ఏపీలో రోడ్లు లేవు.. కరెంట్ లేదు.. ఏపీలో ఉంటే నరకం ఉన్నట్లేనని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. అలాంటి వ్యాఖ్యలు ఇతరులు చేస్తే వైసీపీ నేతలు బూతులతో విరుచుకుపడేవారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం సంయమనం ప్రకటించారు. వ్యాఖ్యలు చేసిన రాత్రే… అన్యాపదేశంగా చేశానని ట్వీట్ చేశారు. కానీ ఆ ట్వీట్‌ను ఎవరూ పట్టించుకోలేదు. కానీ సీఎం జగన్ మాత్రం అదేమీ మనసులో పెట్టుకోలేదు.
ఇష్టమైనవాడు తిట్టినా ప్రశంసలే అన్నట్లుగా ఆయన కేటీఆర్‌తో సుహృద్భావ భేటీ నిర్వహించారు. పూర్తిగా రాజకీయ అంశాలపై వీరి చర్చ జరిగి ఉంటుందని చెబుతున్నారు. సీఎం జగన్ ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణసీఎం కూడా అదే ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో రాజకీయాలపై చర్చ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇతర అంశాలపై దావోస్‌లో చర్చించడానికి ఏమీ లేవని అంటున్నారు.