ఇదేదో సినిమా పేరు అనుకుంటున్నారా… !? కానేకాదు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న సీన్. అర్దంకాలేదు కదా.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు పాలన భవనాలు వదిలి నేరుగా ప్రజలతో ముచ్చటిస్తున్న వైనం. తండ్రీ కొడుకులిద్దరు పోటీ పడి మరీ దీనుల దగ్గరకు వెళ్తున్నారు. రెండు రోజుల క్రితం ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జనగామలో వ్రుద్దురాలు మల్లమ్మతో మాటమాట కలిపారు. దాసరి మల్లమ్మ అనే వ్రుధ్దురాలి పక్కన కూర్చుని క్షేమసమాచారాలు అడిగారు. అంతే కాదు “అవ్వా నేను కేసీఆర్ బిడ్డను నువ్వెలగున్నవో చూసి రమ్మని పంపించుండు. మంచిగున్నావా” అని అప్యాయంగా పలకరించారు. దీనికి మురిసిపోయిన మల్లమ్మ తన రేషన్ కార్డులో భర్త పేరు మాత్రమే ఉందని, తన పేరు లేకపోవడంతో పింఛను రావడం లేదని చెప్పారు. దీనికి స్పందించిన కేటీఆర్ దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ అధికారులను అదేశించారు. అధికారులు స్పందించి మల్లమ్మ పని పూర్తి చేసారు. తాజాగా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు కూడా తన కుమారుడి లాగే స్పందించారు. హైదరాబాద్ టోలి చౌకి వెడుతున్న కేసీఆర్ రోడ్డు పక్కన నిలబడ్డ ఓ వ్రుద్దుడుని చూసి ఆగిపోయారు. దివ్యాంగ వ్రుధ్దుడైన మహ్మద్ సలీమ్ ఈ హఠాత్ సంఘటనతో ఆశ్చర్యపోయారు. మహ్మద్ సలీమ్ ను దగ్గరకు తీసుకున్న ముఖ్యమంత్రి “ఏం పెద్దాయన నీ బాధేంటో చెప్పు” అని అడిగారు. దీనికి ఆ వ్రుధ్దుడు తనకు ఇల్లు లేదని.. ఆనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పారు. దీంతో ఆ దివ్యాంగ వ్రుద్దుడికి పింఛనను, డబల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలంటూ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు. ఈ ఆదేశాలు అందుకున్న వెంటనే కలెక్టరు శ్వేత మహంతి దివ్యాంగ వ్రుధ్దుడు మహ్మద్ సలీమ్ ఇంటికి వెళ్లారు. అతనికి ఫిబ్రవరి నెల పింఛను 3016 రుపాయలు అందించారు. అలాగే జియాగూడలో డబల్ బెడ్రూమ్ ఇల్లు, ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందింస్తామని చెప్పారు. మహ్మద్ సలీమ్ కుమారుడికి కూడా సీఎంఆర్ ఎఫ్ పథకం కింద ఆర్ధిక సహాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ రెండు సంఘటనలు రాజు తలచుకుంటే దెబ్బలకే కాదు… వరాలకి కొదవ ఉండదని వెల్లడయ్యింది.