ప్రపంచంలో అన్నింటికంటె సులువైన పని ఏదయ్యా అంటే.. ఎదుటివాడికి సలహాలు చెప్పడం అని సామెత. రాజకీయాల్లో అయితే నీతులు ప్రవచించడమూ, నైతిక విలువల గురించి నాయకులు ఉపన్యాసాలు ఇవ్వడమూ అంత తేలికైన పని మరొకటి ఉండకపోవచ్చు. అందుకే కాబోలు.. తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రాజ్యం చేస్తున్న కేసీఆర్, దాదాపు అంతేస్థాయిలో చెలరేగిపోతున్న కేటీఆర్ ఇద్దరూ ఆ నీతులు ప్రవచించే బాధ్యతను పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల పర్వం పూర్తయిన తర్వాత.. తండ్రీ కొడుకులు ఇద్దరూ గ్రేటర్లో ఎన్నికైన కార్పొరేటర్లతో విడివిడిగా సమావేశాలు పెట్టుకున్నారు. నిజానికి ఇద్దరూ చెప్పిన కంటెంట్ మాత్రం ఒక్కటే. కార్పొరేటర్లందరికీ హితబోధ చేసిన నీతుల సారాంశం ఒక్కటే.
గ్రేటర్ హైదరాబాద్‌ను మనం విశ్వనగరం గా మార్చేయాలనుకుంటున్నాం. విశ్వనగరం అంటే ఏదో కొత్త నిర్మాణాలు తీసుకురావడం మాత్రమే కాదు. ప్రజలకు అవినీతి వాసన లేని పాలనను కూడా అందించాలి. మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వచ్చి ఒక్క పైసా కూడా ఎవ్వరికీ లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా.. సామాన్యులు తమ పనులు చక్కబెట్టుకుని సంతోషంగా ఇళ్లకు వెళ్లే పరిస్థితి కల్పించాలి. కార్పొరేటర్లు ఎవ్వరూ ఎలాంటి అవినీతికి పాల్పడకూడదు. చాలా నిజాయితీగా ఉండాలి… ఇలాంటి వాక్యాలు చెప్పారు.
తండ్రీ కొడుకులు చెప్పిన సుద్దులు బాగానే ఉన్నాయి. అయితే రాజకీయాల్లో ఉన్న హద్దులు వారిద్దరికీ తెలియనివా? అనేది ఇక్కడ ఎదురవుతున్న మిలియన్ డాలర్ ప్రశ్న. ఎందుకంటే.. తమ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఒక్కొక్కరు ఈ ఎన్నికల్లో గెలవడానికి ఎంతెంత సొమ్ములు ఖర్చు పెట్టారో ఈ తండ్రీకొడుకులకు తెలియదా? కచ్చితంగా నాకు తెలిసిన దాన్ని బట్టి ఒక వార్డులో తెరాస అభ్యర్థి ఒక్కొక్క ఓటుకు రెండు వేల రూపాయలు, హాఫ్ బాటిల్ మద్యం ఇచ్చి ఓట్లను కొన్నాడు. ఇదేమీ చిన్న మొత్తం కాదు. ఇంత ఖరీదుకు కొన్నివేల ఓట్లు కొని ఉంటారని అనుకున్నప్పటికీ.. ఆ సొమ్ములు మొత్తం వారు ఈ పదవీకాలంలో తిరిగి ప్రజలనుంచే దండుకోవాల్సి ఉంటుంది. ఏదో మీడియాలో ప్రచారం తాము ఏం చెబితే అలా వచ్చేస్తుంది కదాని.. నీతులు చెబితే ఎలాగా?
గ్రేటర్ రిజల్ట్ వచ్చిన వెంటనే.. కార్పొరేషన్ ఉద్యోగులు కొందరు ముజ్రా పార్టీ చేసుకుంటూ.. అడ్డంగా దొరికిపోయారు. వాళ్లందరినీ సస్పెండ్ చేశారు… నిష్కర్షగా చెప్పాలంటే.. అది మొక్కుబడి చర్య. గ్రేటర్ ఎన్నికల ఫలితాల్లో గెలిచిన వారిలో ఎవరో కొందరు ధూర్తులే అధికారులకు ఇలా తాగి తందనాలాడడానికి ‘స్పాన్సర్’ చేశారనేది పసిపిల్లలైనా ఊహించగలరు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. అలాంటి వారెవరో కనుక్కుని వారి మీద చర్య తీసుకోవాలి. అది కనుక్కోవడం పోలీసులకు పెద్ద సవాలు కూడా కాదు. తమ పార్టీ వారే ఆ పార్టీని స్పాన్సర్ చేశారని బయటపడితే.. పరువు పోతుందనే ఫీలింగు ఉంటే.. కనీసం గుట్టుచప్పుడు కాకుండా మందలించాలి. అలాంటి చర్యలు తీసుకోకుండా.. ఊరికే సుద్దులు ప్రవచిస్తూ ఉంటే ఉపయోగం ఉండదు.