హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ‘కెటిఆర్, లోకేశ్ అన్నదమ్ముల అనుబంధం’ అంటూ కొమ్మినేని శ్రీనివాసరావు దీనిపై చర్చ పెట్టినప్పుడు సరదాగా చాలా అంశాలు చెప్పాను. పాండవులు కౌరవులు తమలో తామే గాక పరస్పరం కూడా అన్నదమ్ములనే అంటారు. దాయాదులు,జ్ఞాతులు అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. జోరు పెంచిన మంత్రి కెటిఆర్ అత్యుత్సాహంతో అనవసరమైన వాదనలు పెంచవచ్చునని రెండు వారాల కిందటే తెలుగు360లో వ్యాఖ్యానించాను. రాజీనామా సవాలుపై ఎలాగో వివరణ ఇచ్చుకోవలసే వచ్చింది. కెసిఆర్ కూడా ‘ఎక్కడన్నాడు…చెప్పండి’ అని సమర్థించాల్సి వచ్చింది. తర్వాత పార్టీ పేరు మార్పు, భీమవరం పోటీ జోకులు.. అన్నీ కోరి తెచ్చుకున్నవే. మొన్న లోకేశ్‌ను ఉద్దేశించి ‘నీవు స్టేట్ గెస్ట్‌వి’ అనడం కూడా అలాటిదే.
చంద్రబాబును ‘ఇక్కడ నీకేం పని?’ అన్నా లోకేష్‌ను ‘అతిధి’ అన్నా ఎవరూ అంగీకరించే పరిస్థితి వుండదు. ఎందుకంటే హైదరాబాద్ మరో ఎనిమిదేళ్లు ఉమ్మడి రాజధాని. ఇక లోకేశ్ ఇక్కడే పుట్టి పెరిగిన యువకుడు. తెలుగు దేశం జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా. కెటిఆర్ గుంటూరులో చదువుకుంటే లోకేశ్ హైదరాబాదులోనే చదివాడు. నీరు కన్నా రక్తం చిక్కన అన్నట్టు విభజన జరిగినా తెలుగు వాళ్ల మధ్య బంధం అంత సులభంగా చెదిరిపోదు. వ్యంగ్యంగా అన్నా తమ్మీ అని సంబోధించుకుంటూనే లేనిపోని వాగ్బాణాలు అపార్దాలు పెంచే వ్యంగ్యాలు బెడిసి కొడుతుంటాయి.
ఈ విషయంలో లోకేశ్ తడబాటు కూడా వున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన ఎక్కువగా హరీష్ రావుతో వాదనలు పెట్టుకుంటుండేవారు. ట్విట్టర్లోనూ ఆయనపై వ్యాఖ్యలు చేస్తూనే మెచ్చుకోవడం జరిగేది. ఇప్పుడు సమ వారసుడనిపించుకోవడానికి కెటిఆర్పైనే వాగ్బాణాలు ఎక్కుపెడుతున్నారు. గ్రేటర్లో టిడిపి ఎలాగూ పెద్ద విజయం సాధించలేదని తెలిసి కూడా తను నాయకుడుగా ఎస్టాబ్లిష్ కావడానికి ఈ సందర్బాన్ని బాగా వాడుకుంటున్నారు. ‘ఈ ఎన్నికలలో ఎవరూ గెలవరు అని మీరు ముందే ఖాయం చేస్తే ఎలా..?’ అని అడిగితే ‘లోకేశ్ స్వయంగా మేము కింగ్ మేకర్లుగా వుంటాం’ అని చెప్పిన సంగతి గుర్తు చేశాను. గ్రేటర్లో ఎలా వున్నా టిడిపిలో ప్రిన్స్ నుంచి కింగ్‌మేకర్‌గా ఎదుగుతున్న లోకేశ్‌కు ఫలితాలతో నిమిత్తం లేకుండా కలసి వచ్చిన అవకాశమిది. రాబోయే రోజుల్లోనూ ఆయన హైదరాబాదుపైనే దృష్టి పెట్టడం ఖాయం. వారి రాజకీయాలకే గాక వ్యాపార ప్రయోజనాలకు అది అవసరం!
ఎదుటివారిపై బాణాలు వేసేప్పుడు అవి ఎలా ఎదురు తిరుగుతాయని ఆలోచించి వుంటే లోకేశ్ తన ప్రచారంలో ‘ఎవరో తనను కెటిఆర్ అనుకుని డబుల్‌బెడ్ రూం ఇళ్లు అడిగారని’ ట్వీట్ చేసేవారు కాదు. దానివల్ల ప్రజలు తనను గుర్తుపట్టడం లేదనీ, తనను అడగడం లేదని స్వయంగా చెప్పుకున్నట్టు అయింది. దీనికి కెటిఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు గాని ఆయనను గుర్తు పట్టకపోవడం కూడా ఇందులో వుంది. చాలా కాలం ప్రజల్లో నలగాల్సిన అవసరాన్ని ఉభయులూ గుర్తించాల్సిందే. కాకపోతే లోకేశ్ ఇంకా చినబాబు కానీ మంత్రి కాదు గనక మరింత ఎక్కువ జాగ్రత్త వహించాల్సి వుంటుంది.
మొత్తం పైన ఈ అన్నదమ్ములు అతిశయాలు కొంత తగ్గించి, వాస్తవికంగా మాట్లాడితే మంచిది. స్వంతంగా మెజార్టి, కో ఆప్షన్లు, మజ్లిస్ మద్దతు వంటి మూడు దశలు వుండొచ్చని స్వయంగా కెసిఆర్ చెప్పడం ముందు జాగ్రత్తను ప్రతిబింబిస్తే, కెటిఆర్ దూకుడు అత్యుత్సాహానికి ఉదాహరణ అవుతుంది. ఇలాటి సమయాల్లోనే నాలుకు అదుపు తప్పడం…అవసరం లేనివి మాట్లాడి చిక్కులు కొనితెచ్చుకోవడం జరుగుతుంటుంది. అన్నదమ్ములు అప్రమత్తంగా వుంటే మంచిది. ఎన్నికల ప్రచారం ఆఖరి దశలో ఎవరు ఏ మాట జారినా ఓటర్లపై చాలా ప్రభావం వుంటుంది. దిద్దుకునే అవకాశం వ్యవధి వుండవు. సో.. టేక్ కేర్!