వరంగల్ జిల్లా పర్యటనలో కలెక్టర్ ఆమ్రపాలిపై మంత్రి కెటిఆర్ తీవ్ర ఆగ్రహం బాగా ప్రచారమైంది. స్వయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వాగ్దానం చేసిన వాటితో సహా అనేక పథకాలు ఆలస్యం అవుతున్నాయన్నది ఆయన ఆగ్రహానికి కారణమట. అధికారులపై అమాత్యుల ఆగ్రహం కొత్త కాదు గాని ఇప్పుడు తెలంగాణలో వున్న పరిస్థితులలో కెటిఆర్ మందలింపులకు మరింత ప్రాదాన్యత ఏర్పడుతున్నది. ఇప్పటికే దాదాపు 14 జిల్లాల్లో కలెక్టర్లకూ జిల్లాలోని పాలక పక్ష ప్రజా ప్రతినిధులకూ మధ్యన ఘర్షణలూ ఉద్రిక్తతలూ కొనసాగుతున్నాయి. వారంతా అధికారులపై కారాలు మిరియాలు నూరుతున్నారు కూడా. కలెక్టర్లు నిజాయితీగా వున్న చోట ఈ ఘర్షణలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. తమ మాట వినితీరాలని ఎంఎల్ఎలు పట్టుపట్టడం వారు తిరస్కరించడంతో సమస్య మొదలవుతున్నది. అలా చికాకులకు గురైన వారిలో అమ్రపాలి కూడా ఒకరు. ఇటీవల తన మీడియా గోష్టిలో కెసిఆర్ ఇదేమంత సమ్ణస్య కాదన్నట్టు తీసిపారేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అయితే అధికారులు తమ పరిధిలో తాముండాలని హెచ్చరిక వంటిది చేశారు. ఇక ఇప్పుడు షెహన్షా కెటిఆర్ కూడా ఆమ్రపాలిని నేరుగా మందలించడం అధికారుల పక్షానికి అశనిపాతమే. టిఆర్ఎస్కు చెందిన ప్రతి చోటా నాయకుడికి తాము భయపడవలసి వస్తున్నదని వారంటున్నారు. ఈ నేపథ్యం గమనంలో వుండి వుంటే కెటిఆర్ అంతగా ఆగ్రహించేవారు కాదేమో.. లేక కావాలనే దాచుకోకుండా వచ్చిన కోపాన్ని ప్రకటించారేమో.. ఏమైనా తండ్రీ కొడుకులిద్దరూ అధికారులఫిర్యాదులకు పెద్ద విలువ ఇవ్వకపోవడం, కెటిఆర్ మరింత తీవ్రంగా మండిపడటం చూస్తుంటే రాజకీయంగా ప్రభుత్వ వైఖరి అదేనని అర్థమవుతుంది. ఒక వేళ కలెక్టర్ ఆమ్రపాళి చాలా పనులు చేయడంలో వెనకబడ్డారని అనుకున్నా వాటిని చక్కదిద్దడానికి మార్గం బహిరంగంగా ఆగ్రహం కురిపించడం కాదు కదా! జిల్లాల సంఖ్య మూడు రెట్లు పెంచితే వికేంద్రీకరణతో పనులు వేగంగా జరిగిపోతాయని చెప్పిన మాట కూడా నిజం కాదని ఈ పరస్పర ఆగ్రహాలు ఆవేదనలను బట్టి అర్థమవుతుంది.