దేశంలో పది వేల మంది ఫోన్లలో పెగాసస్ సాఫ్ట్ వేర్ ఉందని కేటీఆర్ ప్రకటించారు. మోదీ తన ఫైల్స్‌ను తన కంటే ముందే చదువుతున్నారని ఆయన ఆరోపించారు. పెగాసస్ ఎలా వాడుతున్నారో కేటీఆర్‌కు తెలిసిందంటే.. కేటీఆర్‌కు అంతకు మించిన నిఘా వ్యవస్థ ఉందని అనుకోవాలి. బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ.. తెలంగాణలో టీఆర్ఎస్ అధికార పార్టీ. ఈ రెండు పార్టీలపై ప్రత్యర్థులను నిర్వీర్యం చేసేందుకు అనుచిత పద్దతుల్లో .. ఇజ్రాయెల్ నుంచి నిఘా పరికరాలు తెచ్చి వాడారన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఇంకా వాడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు వీటిపై బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ఫోన్ ట్యాపింగ్ లాంటి ఆరోపణలు చిన్నవి కావు. ప్రత్యర్థి పార్టీలను నాశనం చేయడానికి ఇలాంటి నిఘాను టీఆర్ఎస్ విస్తృతంగా వాడుకుంది. రేవంత్ రెడ్డి ఇష్యూలో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వ్యవహారం నడిచిందని రేవంత్ రెడ్డి వర్గీయులు ఆరోపించారు. అది ఎంత దారుణం అంటే.. అప్పలో మరో రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆడియోను విడుదల చేశారు. ఇంత బహిరంగంగా చేసిన కూడా … సమర్థించుకోవడం వారికే సాధ్యం. ఇప్పుడుకేటీఆర్ తమపై కేంద్రం నిఘా పెట్టిందని ఆరోపిస్తున్నారు. అంటే అధికారం అందుకున్న పార్టీలు ఇలా అనుచిత పద్దతుల్లో ప్రత్యర్థుల్ని అణిచి వేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఈ రెండు పార్టీలే కాదు.. బరితెగించిన పాలకులు ఉన్న ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. రాజకీయ విలువలు అంటూకొన్ని పాటించి మొహమాటస్తులు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి వాటికి చోటు లేదు. కేంద్రంలోకూడా అసలు లేదు. మొత్తంగా రాజకీయ కుట్రలతో రాజకీయాన్ని నడిపేసే దుస్థితి వచ్చింది. ఇది ఎప్పటికైనా ప్రమాదకరమే.