గ్రేటర్లో టీఆర్ఎస్ను గెలిస్తే.. ఇరవై వేల లీటర్ల వరకూ మంచి నీరు ఉచితమని కేసీఆర్ ఎన్నికల హామీ ఇచ్చారు. దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. అయితే.. అనూహ్యంగా టీఆర్ఎస్కు విజయం దక్కలేదు. గ్రేటర్ మేయర్ పీఠంపై టీఆర్ఎస్ కూర్చుంటుందో లేదో కూడా తెలియదు. ఇలాంటి సమయంలో.. ఎన్నికల హామీలు అమలవుతాయా లేదా అన్న సందేహం ప్రజల్లో ఏర్పడింది. ముఖ్యంగా.. అత్యధిక మందికి లబ్ది చేకూర్చే హామీ ఉచిత తాగునీరు. ప్రస్తుతం ఇరవై వేల లీటర్ల వరకూ వాడుకుంటే.. నెలకు ఐదు వందల వరకూ బిల్లు వస్తుంది. అంటే.. అటూ ఇటూగా ఐదు వేల వరకూ ఏడాదికి కట్టాల్సి ఉంటుంది.
టీఆర్ఎస్ ఇప్పుడు..ఆ హామీని అమలు చేస్తే తమకు మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. వారి ఆశలను కేటీఆర్ వమ్ము చేయాలనుకోలేదు. హైదరాబాద్ జలమండలి ద్వారా 20 వేల లీటర్ల వరకు తాగు నీటిని ఉచితంగా అందించేందుకు జనవరి నుంచి ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా కేటీఆర్ ప్రకటించారు. డిసెంబర్ నెల బిల్లులో 20 వేల లీటర్ల వరకు ఛార్జ్ చేయొద్దని ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
జనవరి నుంచి అంటే.. ఈ నెల వాడకం నుంచే.. ఆ బిల్లులో ఆ మొత్తం తగ్గుతుందన్నమాట. ఓ మాదిరి ఇంటికి… నెలకు ఇరవై వేల లీటర్ల నీరు వాడకం ఉండదు. అంత కన్నా ఎక్కువ ఉంటే.. ఆ పై మొత్తానికి మాత్రమే వసూలు చేస్తారు కాబట్టి.. గ్రేటర్ ప్రజలకు కేటీఆర్ ఇచ్చిన హామీని పక్కాగా అమలు చేసినట్లుగానే భావించాలి. విజయం దక్కినా దక్కకపోయినా… రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి.. కేటీఆర్ చేసి చూపిస్తున్నారు.