దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని కలసికట్టుగా పోరాడేందుకు చర్చించుకుందామని స్టాలిన్ ఇచ్చిన పిలుపునకు కేటీఆర్ అంగీకారం తెలిపారు. డీఎంకే నాయకులు వచ్చి ఆహ్వానం ఇచ్చారు. స్టాలిన్ రాసిన లేఖను కూడా ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్ స్టాలిన్ కు సంస్కారం ఉందని ప్రశంసించారు. తాము మీటింగ్ కు హాజరవుతామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి అఖిలపక్ష సమావేశం కూడా డీ లిమిటేషన్ అంశంపై పెట్టలేదని విమర్శించారు.
కేటీఆర్ తీసుకున్న నిర్ణయం అనూహ్యమైనదే. ఎందుకంటే స్టాలిన్ కాంగ్రెస్ పార్టీ కూటమిలో కీలక నేత. ఆయన పెట్టే సమావేశానికి ఇండియా కూటమిలోని పార్టీలు హాజరవుతాయి. ఇతర పార్టీలు హాజరవడం కష్టమే. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఇండియాయేతర కూటమి పార్టీ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూటమిలో కీలక పార్టీ కాబట్టి ఆ పార్టీకి చెందిన దక్షిణాది ముఖ్యమంత్రులు లేదా .. ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారు. రేవంత్ రెడ్డికి ఢిల్లీలో డీఎంకే ఆహ్వానం ఇచ్చింది. హైకమాండ్ సూచన మేరకు హాజరవుతానని రేవంత్ ప్రకటించారు. రేవంత్ లేదా భట్టి విక్రమార్క హాజరు కావొచ్చు. కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరవుతారు.
22వ తేదీన ఈ సమావేశం జరుగుతుంది. రేవంత్ రెడ్డి హాజరు అయితే బీఆర్ఎస్ పార్టీ హాజరవుతుందా లేదా అన్నది సస్పెన్స్. ఏ సమావేశం అయినా సరే రేవంత్ రెడ్డితో వేదిక పంచుకోవడం బీఆర్ఎస్ కు ఇష్టం ఉండదు. అదీ కూడా ఒకే కాజ్ మీద పోరాడే అంశంలో వేదిక పంచుకుంటే.. రెండు పార్టీలు కలిసిపోయాయనుకుంటారు. ఇప్పటికిప్పుడు కేటీఆర్ హాజరవుతామని చెప్పినప్పటికీ.. సమావేశం దగ్గర పడేనాటికి అప్పటి పరిస్థితుల్ని బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.