హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు జరిగింది. ప్రపంచం దృష్టిలో హైదరాబాద్ పడిందని .. అంతా కేటీఆర్ చలువేనని చాలా మంది అభినందించారు. ఇది ఓ సైడ్. కానీ ఈ ఫార్ములా ఈ రేస్ పుణ్యమా అని హైదరాబాద్‌లో సగం జనం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నారు. ప్రజల్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఎవరి కోసం ఈ రేస్ పెడుతున్నారన్నప్రశ్నలు వచ్చాయి. అందుకే కేటీఆర్ ఈ రేస్ ముగిసిన తర్వాత అందిరకీ సారీ చెప్పారు. ఇలాంటి ఈవెంట్లు నిర్వహించాలనుకున్నప్పుడు కొన్ని సమస్యలు వస్తాయని భరించాలని ప్రజల్ని కోరారు. కానీ ఇది నాయకుడు లక్షణం కానే కాదు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి సారీ చెప్పడం.. సులువే .. కానీ అసలు చేయాల్సింది ఇలాంటి సమస్య రాకుండా చేయడం.
ఈ ఫార్ములా రేసు పెట్టాలనుకున్న విషయం చాలా మందుగానే తెలుసు. ట్రాక్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మళ్లింపులకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ప్రజలు సహకరించడానికి సిద్ధంగానే ఉన్నారు. కానీ ఆ రోడ్లలో మాత్రం వెళ్లవద్దు.. మీ ఇష్టం వచ్చిన రోడ్లలో వెళ్లండి అని వదిలిస్తే మొదటికే మోసం వస్తుంది. అన్ని చోట్లా అదే జరిగింది. వ్యవస్థ మొత్తాన్ని ఈ రేసింగ్ కోసం ఉపయోగించి… ప్రజల్ని మాత్రం గాలికి వదిలేశారు. ఫలితంగా హైదరాబాద్ వాసుల్లో ఒక్క సారిగా ఆగ్రహం కనిపించింది.
హైదరాబాద్‌లో అలాంటి రేసులు పెట్టుకోవడానికి అనువైన మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఐటీ కారిడార్‌లో రోడ్లు ఇంకా ఎంతో విశాలంగా అద్భుతంగా ఉంటాయి. అంతకు మించి ఔటర్ రింగ్ రోడ్… అదే స్టాండర్డ్‌తో నిర్మించిన సర్వీస్ రోడ్లు ఉన్నాయి. కానీ నగరం నడిబొడ్డున అత్యంత బిజీగా ఉండే మార్గాన్నే రేసులకు ఎంపిక చేసుకున్నారు. అక్కడ జరిగినా హైదరాబాద్‌లో జరిగినట్లే చెప్పుకుంటారు. కారణం ఏదైనా ప్రజలు మాత్రం ఈ రేసింగ్‌తో తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. చివరికి కేటీఆర్ కూడా గుర్తించి సారీ చెప్పారు. కానీ ఇక్కడ చెప్పాల్సింది సారీ కాదు.. తీసుకోవాల్సింది ముందు జాగ్రత్తలు.. దృష్టిలో పెట్టుకోవాల్సింది సామాన్య ప్రజల్ని. ఎందుకంటే.. ఓట్లు వేసేది ఈ రేసింగ్ చూసి ఎంజాయ్ చేసిన వాళ్లు కాదు… ఈ రేసింగ్ కారణంగా ఇబ్బంది పడిన వాళ్లే.