రాజకీయాల్లో క్షమాపణలు చెప్పడం ఓ ట్రెండ్ గా మారుతోంది. ఎవరో అన్నదానికి క్షమాపణలు చెప్పడం అంటే.. ఆ పనులు చేసిన వారిని టార్గెట్ చేసినట్లుగా ఉంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో కేటీఆర్ ఓ అడుగు ముందుకేశారు. అసలు ఏ మాత్రం సంబంధం లేని అంశంలో క్షమాపణలు చెప్పారు. ఇక్కడ క్షమాపణలు ఎవరికి చెప్పారన్నది మాత్రం ఎవరికీ అర్థం కాదు. అది వేరే విషయం.
అసలేం జరిగిందంటే.. కేరళకు చెందిన షామా మహమ్మద్ అనే మహిళా కాంగ్రెస్ నేత రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉన్నాడని.. ఆయన కెప్టెన్సీ ఆకట్టుకునేలా లేదని ట్వీట్ చేశారు. కాసేపటికి అది ఆమె తాను ఫిట్ నెస్ గురించి చేసినట్లుగా ప్రజల్లోకి వెళ్లలేదని.. బాడీ షేమింగ్ చేసినట్లుగా అందరికీ అర్థమయిందని అనుకుని ట్వీట్ డిలీట్ చేశారు. కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆమెపై విరుచుకుపడుతున్నారు. ఆమెను సెలబ్రిటీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఆమె మాటల్ని కాంగ్రెస్ కు అన్వయించి విమర్శలు చేస్తున్నారు. కేటీఆర్ కూడా అదే వ్యూహాన్ని పాటించారు.
రోహిత్ శర్మపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఎందుకు కోపంగా ఉన్నారో అర్థం కావడం లేదని.. బాడీ షేమింగ్, అవమానకరమైన వ్యాఖ్యలు భ్రాంతికరమైన ప్రకటనలు కాంగ్రెస్ ముఖ్య లక్షణమన్నారు. అలాంటి మాటలకు ఓ భారతీయుడిగా క్షమాపణలు కోరుతున్నానన్నారు. ఆ క్షమాపణలు రోహిత్ శర్మకా.. లేకపోతే షామా మహమ్మద్ వద్ద మనోభావాలు గాయపర్చుకున్న వారికా అన్నది స్పష్టత లేదు. నిజానికి రోహిత్ శర్మ ఫిట్నెస్ మీద చాలా కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. కానీ షామా మహమ్మద్ ఆ మాట చెప్పడం వల్ల విషయం వైరల్ అయింది. అది రాజకీయం అంది.