తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ కార్యక్రమం నుంచి ఆహ్వానం అందింది. దుబాయ్‌లో జరిగే ప్రపంచ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. జూన్ 7, 8వ తేదీల్లో దుబాయ్‌లోని జుమేరా ఎమిరేట్స్ టవర్ వేదికగా జరగనుంది. మంత్రి కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ అద్భుతమైన పురోగతిని, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో సాధించిందని, ఇలాంటి నాయకులు తమ సమావేశంలో పాల్గొనడం వలన సమావేశానికి ఎంతో విలువ చేకూరుతుందని నిర్వాహకులు మంత్రి కేటీఆర్‌కు పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ ఐటీ రంగంలో అద్భుతమైన పురోగతి కనబరుస్తోంది. అంతర్జాతీయ సంస్థలు, ఎమ్మెల్సీలు తమ అతిపెద్ద క్యాంపస్‌ను హైదరాబాద్‌లో పెడుతున్నాయి. ఏఐ రంగంలోనూ పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ విషయంలో కేటీఆర్ చూపిస్తున్న చొరవ ఈ రంగ ప్రముఖుల్ని ఆకర్షించింది. అందుకే ఆయనను ముఖ్య అతిధిగా పిలిచినట్లుగా తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోలో అంతర్జాతయ సంస్థలన్నీ పాల్గొనననున్నాయి. భవిష్యత్‌లో ప్రపంచం మొత్తం ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ చుట్టూనే తిరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వేగంగా మారుతున్న టెక్ ప్రపంచంలో ఏఐ మరో సరికొత్త విప్లవం కానుంది.