కరోనా నుంచి కేటీఆర్ కోలుకున్న తర్వాత.. ఇప్పుడు ఆ కరోనా బారి నుంచి ప్రజల్ని కాపాడే టాస్క్‌ఫోర్స్‌కు చీఫ్ అయ్యారు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతతో ఆయన రంగంలోకి దిగి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ బిజీలోనే చాలా రోజుల తర్వాత ట్విట్టర్లో ఆస్క్ కేటీఆర్ పేరుతో నెటిజన్లతో రెండు గంటల సేపు ముచ్చటించారు. అయితే.. అనూహ్యంగా ఎక్కువ మంది కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి ఎందుకు చికిత్స చేయడం లేదన్న సమస్యనే ప్రస్తావించారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రతి నలుగురు, ఐదుగురిలో ఒకరు అదే ప్రశ్న వేస్తూండటంతో చివరికి కేటీఆర్ కూడా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని సమాధానం ఇచ్చారు.
కానీ.. నెటిజన్లు మాత్రం.. ఈ సమాధానంపైనా సెటైర్లు వేస్తున్నారు. ముఖ్యమంత్రికి ఈ విషయం పై ఇంత వరకూ అవగాహన లేదా.. తెలియదా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స లేదు. ఫలితంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరే వారు సొంత ఖర్చుతో వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఒక్కో ఆస్పత్రి లక్షల్లో బిల్లు వసూలు చేస్తోంది. వైద్య వసతులు ఎక్కువగా ప్రైవేటు రంగంలోనే ఉండటంతో ఎక్కువ మంది.. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని కోరుతున్నారు. కానీ ప్రైవేటుకు ఆ చాన్స్ ఇస్తే.. ప్రభుత్వం ఖర్చయిపోతుందన్న ఉద్దేశంతో పాలకులు ఉన్నారు. అందుకే ఎవరు ఎన్ని రకాలుగా డిమాడ్లు చేసినా స్పందించడం లేదు.
చివరికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఆమరణదీక్ష కూడా చేశారు.. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు ట్విట్టర్లో.. కేటీఆర్‌కు ఆ డిమాండ్‌కు ఉన్న తీవ్రత ఏమిటో తెలిసి వచ్చింది. మరి ఈ విషయంలో ఆయన సీరియస్‌గా.. ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తారా..? లేకపోతే.. మళ్లీ సైలెంటయిపోతారా.. అన్నది చూడాలి. దీనిపై స్పందన లేకపోతే.. మరోసారి నేటిజన్లు ఇదే అంశంపై ఆస్కింగ్ ప్రోగ్రాం పెట్టుకున్న ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.