ముందస్తు ప్రశ్నే లేదని గతంలో కేసీఆర్ పలు మార్లు ప్రకటించిన దానికి భిన్నంగా ఇటీవల కేటీఆర్ ప్రకటనలు ఉంటున్నాయి. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర ఉన్నాయి కదా అని రిలాక్స్ కావొద్దని కేటీఆర్ చెబుతున్నారు. జిల్లాల పర్యటనల్లో ఆయన ఖచ్చితంగా పార్టీ నేతలకు ఈ సందేశం ఇస్తున్నారు. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చంటున్నారు. దీంతో టీఆర్ఎస్ నేతల్లోనూ మళ్లీ ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం పీకే టీంతో టీఆర్ఎస్ టై అప్ అయింది. గతంలోలా ఈ సారి సిట్టింగ్లు అందరికీ సీట్లిచ్చే పరిస్థితి లేదని.. ఈ సారి టిక్కెట్లు ఇచ్చేది కేసీఆర్ కాదని.. ప్రశాంత్ కిషోర్ అని కేటీఆర్ చెబుతున్నారు. పీకే టీం చేసే సర్వే ఆధారంగానే టిక్కెట్లిస్తామని ఆయన చెబుతున్నారు. పీకే టీం గత ఎన్నికల్లో వైసీపీ నేతలకూ టిక్కెట్లు ఇచ్చింది. ఈ క్రమంలో ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పీకే టీం సర్వేలు పూర్తి చేసింది.
వైఎస్ జగన్ ఏడాది చివరిలో అసెంబ్లీని రద్దు చేసి మార్చిలో ఎన్నిలకు వెళ్లాలని అనుకుంటున్నారు. అయితే ఆయన ఒక్కరే కాదని.. తోడుగా కేసీఆర్ కూడా ముందస్తుకు వెళ్తారన్న చర్చ జరుగుతోంది. కానీ సమయానికే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడు మళ్లీ మనసు మార్చుకున్నట్లుగా ఉన్నారని.. అందుకే ఎప్పుడైనా ఎన్నికలన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.