తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. భారతీయ జనతా పార్టీ విషయంలో తన సాఫ్ట్ కార్నర్‌ను మెల్లగా తొలగించుకుంటున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయన రాష్ట్ర బీజేపీ నేతలపై ఎదురుదాడి చేయడం కంటే.. కేంద్రంపై ఎటాకింగ్ పాలిటిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఐటీఐఆర్, కోచ్ ఫ్యాక్టరీ సహా తెలంగాణకు సంబంధించిన అంశాలపై కేంద్ర వైఖరిని ఎప్పటికప్పుడు.. తప్పు పడుతూ వస్తున్నారు. విమర్శిస్తున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తాజాగా .. కేంద్రం గుజరాతీ ప్రాధాన్యతను కూడా హైలెట్ చేస్తున్నారు. బుల్లెట్ ట్రైన్‌ను గుజరాత్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారని… హైదరాబాద్‌కు ఎందుకు అర్హత లేదని ఆయన ప్రశ్నిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ సమావేశంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్ ప్లస్ పాయింట్లను చెప్పడమే కాదు… కేంద్రం నిరాదరణను కూడా ప్రభావవంతంగా వ్యక్తం చేశారు.
బుల్లెట్ ట్రైన్ అంశంపై ఇప్పటికే పెద్ద ఎత్తున కేంద్రంపై విమర్శలు వస్తున్నారు. రైల్వేలను ప్రైవేటీకరిస్తూ.. లక్ష కోట్లకుపైగా ఖర్చుపెట్టి.. గుజరాత్‌కు.. బుల్లెట్ ట్రైన్ వేయడం అంటున్నారు. అంతే కాదు.. దేశంలో ఎన్నో సుప్రసిద్ధ నగరాలు.. అభివృద్ధి చెందాల్సినవి ఉండగా… అహ్మాదాబాద్‌కు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలు కూడా హైలెట్ అవుతున్నాయి. కేటీఆర్ విమర్శలు బీజేపీ నేతలను సూటిగా తగులుతున్నాయి. వారు కిందా మీదా పడి విమర్శలు చేస్తున్నారు. ఆ హామీలన్నీ బీజేపీ నెరవేర్చకపోవడానికి టీఆర్ఎస్సే కారణం అని వాదించడం కూడా చేస్తున్నారు.
అయితే కేటీఆర్ మాత్రం వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. కేంద్రప్రభుత్వాన్నే ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. మామూలుగా గ్రేటర్ ఎన్నికల తరవాత కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత బీజేపీ విషయంలో ఒక్క సారిగా సైలెంటయ్యారు. ఇదే అదనుగా..బీజేపీ నేతలు చెలరేగిపోయారు. మౌనాన్ని ఆసరాగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలను బీజేపీ నేతలు చేస్తూండటంతో టీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే కేంద్రాన్ని మాత్రం ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ రూట్ మార్చినట్లుగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వంపై .. నిర్మాణాత్మకంగా విమర్శలు చేయడంలో కేటీఆర్ దూకుడు చూపిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణపై చూపిస్తున్న వివక్షతో పాటు.. కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని కూడా ఎండగడుతున్నారు.