కేసీఆర్ కొడుకుగా చెబుతున్నా అవసరమైతే తెలంగాణ కోసం చనిపోతానని కేటీఆర్ ఎమోషనల్ గా ప్రకటించారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో రూ. 55 కోట్ల తెలంగాణ ప్రజల టన్నులుగా కట్టిన సొమ్మును అక్రమంగా దేశం దాటించేశారన్న కేసులు ఎదుర్కొంటున్న ఆయన ఏసీబీ ఆఫీసుకు వెళ్లే ముందు ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ఈ కేసుకు.. తెలంగాణ సెంటిమెంట్‌కు.. తెలంగాణ కోసం చనిపోవడానికి కానీ సంబంధం లేదు. స్పేస్ లేకపోయినా కేటీఆర్ తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ కంబంధహస్తాల్లో తెలంగాణ ఉందని.. బయటపడేవరకూ పోరాటం ఆగదని కేటీఆర్ చెప్పుకొచ్చారు. తాను క్విడ్ ప్రో కోల్ పాల్పడలేదన్నారు. అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని.. తామేమీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరకలేదని మండిపడ్డారు. మాకు న్యాయవ్యవస్థపై పూర్తిగా నమ్మకం ఉందన్నారు. అంతకు ముందు కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. హైదరాబాద్ కోసమే అవిశ్రాంతంగా పని చేశామన్నారు. తెలంగాణ బ్రాండ్ఇమేజ్ ను ప్రపంచ పటంలో పెట్టడానికే ప్రయత్నించానన్నారు.
రాజకీయాలు చేసే చిన్న మనస్తత్వం కలిగిన నాయకులకు ఫార్ములా-ఈ కార్ రేసు అంశం అర్థం కాలేదని కానీ విజ్ఞులైన తెలంగాణ ప్రజలకు ఈ అంశం తెలుసన్నారు. తమ ప్రభుత్వ విజన్‌ను, నిజాన్ని తెలంగాణ ప్రజలు తప్పకుండా గుర్తిస్తారని చెప్పుకొచ్చారు. ఏసీబీ ఆఫీసుకు వెళ్లే ముందు కేటీఆర్ బీఆర్ఎస్ కీలక నేతలతో సమావేశమయ్యారు. కవిత, హరీష్ రావు కూడా వచ్చారు. తన న్యాయవాదికి అనుమతి ఇవ్వడంతో రామచంద్రరావు అనే న్యాయవాదితో కలిసి ఏసీబీ ఆఫీసుకు వెళ్లారు.