కేసీఆర్ తన వారసుడిగా కేటీఆర్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో ఎంత నిజం ఉందో కానీ.. అధికారులు మాత్ర.. ఆయనను సీఎంగానే చూడటం ప్రారంభించారు. సీఎంవో అధికారులు రోజూ ఆయననే కాంటాక్ట్ చేస్తున్నారు. ఎమర్జెన్సీ అయితే తప్ప.. సీఎం కేసీఆర్ కాంటాక్ట్‌లోకి వెళ్లడం లేదని అంటున్నారు. చివరికి సీఎంవో మీడియా వ్యవహారాల్లో కేసీఆర్ పేరు పెద్దగా కనిపించడం లేదు. కేటీఆర్ కార్యక్రమాల గురించే వివరంగా వస్తున్నాయి.
టీఆర్ఎస్ అధినేత పార్టీలో కానీ.. ప్రభుత్వంలో కానీ ఏమైనా మార్పులు చేయాలనుకుంటే.. దానికి తగ్గట్లుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటారు. పార్టీలో ఇప్పటికే కేటీఆరే ఏ క్షణమైనా సీఎం అనే భావనను… చొప్పించేశారు. ఇప్పుడు అధికారవర్గాల్లోకీ పంపిస్తున్నారంటున్నారు. అధికారులతో డీల్ చేయాల్సిన విధానం వేరుగా ఉంటుంది. అందుకే… మొన్నటి రిహార్సల్ కేబినెట్ భేటీ…నిర్వహించారని అంటున్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఎక్కువగా ఫాం హౌస్ కే పరిమితం కావడం.. ప్రగతి భవన్ వేదికగా కెటిఆర్.. అన్ని డిపార్ట్ మెంట్లతో రివ్యూ చేస్తున్నారు. ఇదంతా వ్యూహం ప్రకారమే చేస్తున్నారని అందరికీ క్లారిటీ వచ్చేసింది.
వరంగల్ లో వరద బాధిత ప్రాంతాలను కేటీఆర్ పరిశీలించడానికి వెళ్లిన సమయంలో మొత్తం కార్యక్రమాన్ని సీఎంవోనే సమన్వయం చేసింది. ఏర్పాట్లన్నీ… సీఎంవోనే పర్యవేక్షించింది. కేసీఆర్ తరహాలోనే కేటీఆర్ అక్కడ… హామీలు ఇచ్చారు. వరంగల్‌కు రూ. పాతిక కోట్లు ప్రకటించేశారు. ఈ పరిణామాలన్నీ నాయకత్వ మార్పులో భాగంగానేనని అంటున్నారు. ఇలా.. ప్రజల్లో .. అధికారుల్లో విస్తృతమైన చర్చ జరిగేలా చేసి.. అందరూ… ఇక కేటీఆరేగా అనుకునేలా చేసి.. చివరికి.. కుర్చీలో కూర్చోబెడితే పెద్దగా రియాక్షన్ రాదని కేసీఆర్ అంచనాగా చెబుతున్నారు. రాజకీయ వ్యూహాల్లో కేసీఆర్ ను మించిన వారు లేరని ఇప్పటికే నిరూపించుకున్నారు మరి..!