హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ చేతులెత్తేస్తుందని కేటీఆర్ నమ్మకం పెట్టుకున్నారు. ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి అదే చెబుతున్నారు. అసెంబ్లీలోనూ అదే చెప్పారు. మూడు నెలల్లో హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం తేలిపోతుందని ఆయన చెప్పుకొచ్చారు. కేటీఆర్ వ్యాఖ్యలు రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి కేసీఆర్ రెండు సార్లు సీఎం అయినప్పుడు.. ఇచ్చిన హామీలను… మొదటి మూడు నెలల్లో అమలు చేసిన తీరును చూస్తే.. కేటీఆర్ ఇలా అనరని అంటున్నారు. బీఆర్ఎస్కు తొందర ఉంటే.. ప్రజలు తిరుగుబాటు చేయరని కాంగ్రెస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. వంద రోజుల్లో ఆరు హామీలను అమలు చేస్తామని రేవంత్ ప్రకటించారు.
ఆ ప్రకారం రెండు హామీలు అమలు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళల్లో రేవంత్ ప్రభత్వంపై నమ్మకం పెంచింది. ఇవాళ కాకపోతే రేపు అయినా పథకాన్ని అమలు చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. అందుకనే కేవైసీ అప్ డేట్ కోసం పరుగులు పెడుతున్నారు. ఇది ప్రభుత్వంపై నమ్మకం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు మహిళల్ని ఆకట్టుకోవడానికి రేవంత్ కు .. ఈ పథకం ప్రారంభం కన్నా గొప్ప అవకాశం ఉండదు. ఖచ్చితంగా ప్రారంభిస్తారు మిగతా పథకాలు కూడా అమలు చేస్తామని రేవంత్ నమ్మకంగా చెబుతున్నారు.
తెలంగాణకు రుణభారం ఎక్కువగా ఉండువచ్చు కానీ.. ఆదాయం మాత్రం తక్కువగా లేదని.. కానీ గతంలో ప్రభుత్వం సంపదను ప్రజలకు పంచడం కాకుండా కాంట్రాక్టర్లకు పంపిచిందని.. తాము ప్రజలకు పంచుతామని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఆదాయాన్ని పెంచే విషయంలో రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయంటున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లోనే చేతులు ఎత్తేస్తుందని సర్ది చెప్పుకోవడం…కేటీఆర్ రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని బీఆర్ఎస్ లోనూ సెటైర్లు వినిపిస్తున్నాయి.