కేటీఆర్ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు ఓ పట్టానా అంతుబట్టడం లేదు. విషయం ఏదైనా అది బీఆర్ఎస్ సాధించిన గెలుపుగా, ప్రభుత్వానికి చెంపపెట్టుగా ప్రొజెక్ట్ చేయడం తరుచుగా చేస్తున్నారు. తాజాగా కంచగచ్చిబౌలి భూవివాదంలో సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో కేటీఆర్ రియాక్షన్ అలాగే ఉంది.
కంచ గచ్చిబౌలి భూములు అమ్ముకుంటారా? లేదా అన్నది తమకు అనవసరమని , పర్యావరణవిధ్వంసంపై మాత్రమే తాము విచారణ చేస్తున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. చెట్లను కొట్టేసేముందు అటవీశాఖ అధికారుల నుంచి అనుమతులు పొందారా? లేదా అని ప్రశ్నించింది.
అనుమతులు తీసుకోకుండా చెట్లను నరికివేస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని జస్టిస్ గవాయ్ బెంచ్ హెచ్చరించింది. చెట్ల కొట్టివేతపై తదుపరి విచారణ వరకూ స్టేటస్ కో కొనసాగించారు. దీన్ని కంచి గచ్చిబౌలి భూముల వేలం ఆపాలని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కేటీఆర్ చెబుతుండటం ఆశ్చర్యపరుస్తోంది.
స్పష్టమైన ప్రణాళికతో రేవంత్ సర్కార్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే సమస్యకు ఎండ్ కార్డు పడుతుందని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే కేటీఆర్ తర్వాత అభాసుపాలు కావడం ఖాయం. అందుకే కోర్టు విచారణలపై ఆచితూచి స్పందించాలనే వాదనలు వినిపిస్తున్నాయి.