హైదరాబాద్: ‘పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినపుడు పుట్టదు, జనులా పుత్రుని పొగడగ…’ అని సుమతీ శతకంలో పద్యం. ఇప్పుడు కేసీఆర్కు ఆ పుత్రోత్సాహాన్ని కలిగిస్తున్నాడు కేటీఆర్. మొన్న వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఉపఎన్నికలోగానీ, ఇవాళ గ్రేటర్ ఎన్నికల్లోగానీ పార్టీకి అఖండ విజయాన్ని ఒంటిచేత్తో సాధించుకొచ్చారు కేటీఆర్. ఈ రెండు ఎన్నికల్లో కూడా అభ్యర్థుల ఎంపిక దగ్గరనుంచి పోలింగ్ వరకు అన్నీ తానై నడిపారు. విపరీతంగా కష్టపడ్డారు. అద్భుత ఫలితాలు సాధించారు. ముఖ్యంగా గ్రేటర్ ఎన్నికల్లో ముందే చెప్పి మరీ 100 స్థానాలలో విజయం సాధించటంతో కేటీఆర్ పాపులారిటీ తారాస్థాయికి చేరిపోయింది. అయితే ఇంత అద్భుత విజయాలు సాధించినా కూడా ఆయనలో ఎక్కడా గర్వంగానీ,భేషజంగానీ కనబడకపోవటం విశేషం. బయట ఎక్కడ ఏ కార్యక్రమాలలో పాల్గొన్నా కూడా అన్ని వర్గాలతో కలిసిపోతూ, పెద్దా, చిన్నా అనే తేడా చూపకుండా అందరికీ గౌరవం ఇచ్చి మాట్లాడుతుంటారు. పాలనా వ్యవహారాలలో తండ్రికి సలహాలు ఇస్తున్నారు. ఆంగ్లం బాగా వచ్చి ఉండటం వలన జాతీయస్థాయిలోగానీ, రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల, దేశాల ప్రముఖులు వచ్చినప్పుడుగానీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించటమేకాకుండా, ప్రభుత్వ వాదనను చక్కగా వ్యక్తం చేస్తున్నారు. సమర్థుడైన వారసుడిగా నిరూపించుకున్నారు. కేవలం కీలక పదవుల్లో ఉన్న తండ్రికి పుట్టటమే వారసత్వంగా పరిగణిస్తున్న ఈ కాలంలో సమర్థతకూడా ఉన్న కేటీఆర్ – తన తండ్రి వారసత్వాన్ని తీసుకున్నా తప్పుపట్టాల్సిన అవసరంలేదనే చెప్పాలి.