తెలంగాణ సర్కార్లో నెంబర్ టూగా ఉంటూ.. సీఎం రేంజ్ పవర్స్ తో పాటు విధులు కూడా నిర్వహిస్తున్న అనధికారికంగా కేబినెట్ భేటీ కూడా నిర్వహించేశారు. ప్రాక్టీస్ కోసం అన్నట్లుగా జరిగిన ఈ కేబినెట్ భేటీ.. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే కేబినెట్ భేటీకి ఏ మాత్రం తీసిపోలేదు. మంత్రులందరూ హాజరయ్యారు. చీఫ్ సెక్రటరీ సోమేష్ సహా ఉన్నతాధికారులు అందరూ వచ్చారు. కేటీఆర్ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ముఖ్యమంత్రి మాత్రమే కేబినెట్ భేటీ నిర్వహించాలి కాబట్టి.. ఈ సమావేశానికి కేబినెట్ సబ్ కమిటీ సమావేశంగా పేరు పెట్టారు.
సాధారణంగా ప్రగతి భవన్కు మంత్రులు అందరూ ఒకే సారి ఎప్పుడూ రారు. కేబినెట్ భేటీ జరిగినప్పుడు మాత్రమే వస్తారు. కానీ బుధవారం వచ్చారు. ఫుడ్ ప్రాసెసింగ్,లాజిస్టిక్స్ పాలసీ కోసం సమావేశమవుతున్నట్టు మంత్రులకు.. ప్రగతి భవన్ నుంచి పిలుపు వెళ్లింది. మంత్రులందరితో కేటీఆర్ రెండు పూటలా సమావేశమయ్యారు. అధికారికంగా కేబినెట్ భేటీ కాదు కానీ.. ఆ తరహాలోనే సాగింది. కేటీఆర్ పట్టాభిషేకం కోసం.. కేబినెట్ భేటీని నిర్వహించే ప్రాక్టీస్ కూడా..కేసీఆర్ చేయిస్తున్నారేమోనన్న చర్చ.. టీఆర్ఎస్లోనే కాదు.. విపక్షాల్లో కూడా ప్రారంభమయింది.
కేసీఆర్ ఉద్దేశ్య పూర్వకంగానే ఈ భేటీ ఏర్పాటు చేసి అధికారులకు, ప్రభుత్వ వర్గాలకు కేటీఆర్ పట్టాభిషేకంపై సంకేతమిచ్చారని అంటున్నారు. ఇప్పటికే పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ తో నంబర్ టూ గా ఉండగా, ప్రభుత్వంలోనూ నంబర్ టూ అని తేల్చేశారంటున్నారు. ఈభేటీ తర్వాత మళ్ళీ కేటీఆర్ సీఎం అన్న ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది.