రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు హైదరాబాద్ లో అర్ధరాత్రి పర్యటించారు. రోడ్డు, బస్టాపులు వగైరాలను పరిశీలించారు. నగర రహదారులు ఎంత అందంగా ఉన్నాయో కళ్లారా వీక్షించారు. కూకట్ పల్లి, హౌసింగ్ బోర్డ్ కాలనీ, సంజీవరెడ్డి నగర్, అమీర్ పేట, పంజాగుట్ట, తదితర ప్రాంతాలను పరిశీలించారు.
రోడ్డు దరిద్రంగా ఉన్నాయంటూ వార్తాచానళ్లు, పత్రికల్లో తరచూ కథనాలు వచ్చిన చోట్ల కూడా పరిస్థితి అలాగే ఉంది. ఇది చూసిన కేటీఆర్ కు కోపం ముంచుకొచ్చింది. రోడ్లను త్వరగా బాగుచేయాలని అధికారులను ఆదేశించారు. బస్ స్టాపులు అధ్వానంగా ఉండటంపైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్ స్టాపుల్లో కనీసం ప్రయాణికులు కూర్చునే సదుపాయం కూడా లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
కేటీఆర్ ఆ మధ్య అట్టహాసంగా ప్రకటించిన వంద రోజుల యాక్షన్ ప్లాన్ తుస్సుమంది. ఆయన చెప్పిన పనుల్లో చాలా వరకు జరగలేదు. దీంతో మంత్రిగారు మాటలకే పరిమితం అనే విమర్శలు వచ్చాయి. ఆయన అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాదులో రోడ్లు, ఇతర సమస్యలపై దృష్టిపెట్టారు.
ఏదో ఒకసారి అధికారులను ఆదేశించి ఊరుకుంటే లాభం లేదని గ్రహించినట్టున్నారు. అందుకే, అర్ధరాత్రివేళ కూడా మంత్రి పర్యటిస్తారనే భయం అధికార యంత్రాంగంలో కలిగేలా చర్యలు తీసుకోవాలని భావించినట్టు కనిపిస్తోంది.
హైదరాబాద్ ను విశ్వనగరం చేయాలనే సంకల్పం నెరవేరాలంటే జరగాల్సింది చాలా ఉంది. అసలు మామూలు నగరంగా మారడానికే నెలలు పట్టేలా ఉంది. ఇదే వేగంతో పనులు జరిగితే విశ్వనగరంగా మారడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలియదు. దీంతో కేటీఆర్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అధికార యంత్రాంగంలో కదలిక తేవడానికి స్టయిల్ మార్చారు. ఆఫీసులో కూర్చుని ఆర్డర్ వేయడం కాదు, తాను స్వయంగా అధికారులను వెంటబెట్టుకుని నగరంలో పర్యటిస్తే ఫలితం ఉంటుందని భావించారు. మరి ఈ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూద్దాం.