తన ఆరోగ్యం బాగో లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. తనకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. తనకు ఎన్నో ఎళ్లుగా అలర్జీ ఉందన్నారు. ఆ అలర్జీ కారణంగా జలుబు చేసిందని… సిరిసిల్ల పర్యటనలో అందుకే కొంత ఇబ్బంది పడినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. ఇలా వివరణ ఇవ్వడానికి కారణం… సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ పదే పదే ముక్కు తుడుచుకుంటూ కనిపించడమే. సిరిసిల్ల ఎమ్మెల్యేగా సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం మొత్తం ఆయన జలుబు వల్ల ఇబ్బంది పడుతున్నట్లుగానే ఉన్నారు. ఇప్పుడు తుమ్మినా.. దగ్గినా.. జలుబుతో బాధపడినా అందరూ ఓ రకమైన అనుమానంతో చూసే కాలం. అందులో చాలా మంది కేటీఆర్ ఆరోగ్యంపై వాకబు చేశారు. ఇవి అంతకంతకూ పెరుగుతూండటంతో.. కేటీఆరే వివరణ ఇచ్చారు. కొన్నేళ్లుగా అలర్జీతో బాధపడుతున్నాని సిరిసిల్ల వెళ్తున్నప్పుడు మరోసారి జలుబు వచ్చిందన్నారు.
కార్యక్రమాన్ని అకస్మాత్‌గా రద్దు చేస్తే.. చాలా మంది ఇబ్బంది పడతారని..అందుకే సిరిసిల్లకు వెళ్లానన్నారు. తప్పరిసరి పరిస్థితుల్లో కార్యక్రమాన్ని కొనసాగించామన్నారు. కేటీఆర్ జలుబుతో బాధపడటంతో.. విపక్షపార్టీల సోషల్ మీడియా కార్యకర్తలు.. కరోనా టెస్టులు చేయించాలంటూ.. పోస్టులు కూడా పెట్టారు. కేటీఆర్ వివరణతో అంతా సద్దు మణిగినట్లయింది.