తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా ఎడమెహం, పెడమొహంగా ఉంటున్న నేతలు… కేటీఆర్, హరీష్ రావు. కేటీఆర్ లీడ్ తీసుకోక ముందు… టీఆర్ఎస్ మొత్తం హరీష్ చేతుల్లో ఉండేది. ఇప్పుడు హరీష్ .. ఓ మంత్రి మాత్రమే. ఇంకా చెప్పాలంటే.. తెలంగాణ ప్రభుత్వంలో… ఓ చిట్టచివరి మంత్రి. ఆయనకు ఎలాంటి బాధ్యతలు పార్టీ పరంగా అప్పజెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రగతి భవన్‌లోకి కూడా ప్రవేశం … కేసీఆర్ పిలిచినప్పుడే లభిస్తోంది. హరీష్‌పై అంత అనుమానం.. కేసీఆర్‌కు ఎందుకు వచ్చిందో కానీ… క్యాడర్లో మాత్రం గందరగోళం ఏర్పడింది. హరీష్ తో వ్యవహారాలు నడిపిన నేతలు.. ఒక్కొక్కరు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరిపోుతన్నారు. దీంతో.. ఈ పరిస్థితికి చెక్ పెట్టాలనుకున్నారేమో కానీ… ఇద్దరూ కలిసి మీడియా ముందుకు వచ్చారు.
సిరిసిల్ల నియోజకవర్గానికి చెందిన నేతలను.. హైదరాబాద్ పిలిపించిన కేసీఆర్.. దానికి హరీష్ రావును కూడా ఆహ్వానించారు. హరీష్ రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి పథంలో సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గాలు పోటీపడి ముందుకు పోతున్నాయని ఆయన తెలిపారు. 30 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని గత నాలుగేళ్లలో నే మంత్రి కేటీఆర్ తన నియోజకవర్గం సిరిసిల్లలో చేసి చూపించే ప్రయత్నం చేశారని అభినందించారు. హరీష్ రావు , తాను అభివృద్ధిలో మాత్రమే పోటీ పడుతున్నామని కేటీఆర్ చెప్పుకొచ్చారు. సొంత అన్నదమ్ముల్లా కలిసి పెరిగామని గుర్తు చేసుకున్నారు. కాలంతో పోటీపడి కాళేశ్వరం ప్రాజెక్టును హరీష్ రావు పరిగెత్తిస్తున్నారన్నారని పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్ మరో 15 ఏళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు.
మొత్తానికి హరీష్ రావు.. వ్యవహారం.. టీఆర్ఎస్ లో కలకలంలానే మారింది. టీఆర్ఎస్ సొంత మీడియాలో… హరీష్ రావుకు సంబంధించిన వార్తలను కొంత కాలం నుంచి పూర్తిగా బ్యాన్ చేశారు. నేరుగా పొమ్మనలేక.. పొగ పెడుతున్నారన్న ప్రచారాన్ని ప్రారంభించారు. హరీష్ ఎప్పుడు టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోతారా అని… ప్రగతి పెద్దలు ఎదురు చూశారన్న ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పుడు నేరుగా.. కేటీఆర్, హరీష్ కలిసి మాట్లాడటంతో… ఈ ఎపిసోడ్ మరికొంత కాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.