జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ విషయంలో జరుగుతున్న రాద్దాంతంపై కేటీఆర్ స్పందించారు. ప్రభుత్వం తమ కుటుంబంపై కుట్ర పన్నిందని ఆరోపించారు. పాలనా వైఫల్యాలపై నిలదీస్తున్నామని తమపై.. తమ బంధువులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. జన్వాడలో ఉన్నది తన బావమరిది రాజ్ పాకాల ఫామ్ హౌస్ కాదని అది ఇల్లు అనికేటీఆర్ తెలిపారు. ఇంట్లో దసరా,. దీపావళి సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దావత్ ఇచ్చారని… కుటుంబసభ్యులందరూ దావత్ చేసుకున్నా తప్పేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. నంది నగర్ ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు.
దావత్లో 13 మందికి నెగిటివ్ వస్తే ఒకరికే పాజిటివ్ వచ్చిందంట. ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్ తీసుకున్నారో విచారించాలి. సోదాల పేరుతో ఇబ్బందులు పెడితే ఊరుకోం. ఉదయం ఎక్సైజ్ కేసు.. సాయంత్రానికి డ్రగ్స్ కేసుగా ఎలా మారింది. డ్రగ్స్ ఎవరు, ఎక్కడ తీసుకున్నారో తెలుసుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడబలుక్కుని మాట్లాడుతున్నాయని ఆరోపించారు. మా గొంతు నొక్కడానికే మాపై, మా కుటుంబసభ్యులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అసలు రేవ్ పార్టీ అంటే అర్థం తెలుసా ?. కుటుంబసభ్యులంతా పార్టీ చేసుకుంటే రేవ్ పార్టీ అంటారా ?. ఎన్ని కేసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని చెండాతూనే ఉంటామని హెచ్చరించారు. రాజ్ పాకాలకు కూడా డ్రగ్ టెస్టు చేశారని కానీ ఆయనకు నెగెటివ్ వచ్చిందన్నారు. పార్టీలో ఒక్క మిల్లీ గ్రాము కూడా మత్తు మందు దొరకలేదన్నారు. జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వరుస వైఫల్యాలు చెందిందని విమర్శించారు. ఇచ్చిన 6 గ్యారెంటీలను రేవంత్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. 11 నెలల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. 11 నెలల కాంగ్రెస్ వైఫల్యాలను బయటపెడుతున్నామని చెప్పారు. రాజకీయంగా తమను ఎదుర్కొలేకపోతున్నారని అన్నారు. తమ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.