కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అనీ, దేశం కేసీఆర్ వైపు చూస్తుంటే.. యువతరం కేటీఆర్ వైపు చూస్తోందనీ, ఆయన ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి మరింత పరుగులు తీస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, అవునా.. కేటీఆర్ రెడీ అయిపోయారా, కేసీఆర్ కూడా అదే వ్యూహంతో ఉన్నారా అనే చర్చ మళ్లీ తెర మీదికి వచ్చింది. ఇప్పుడు ఆ అంశమ్మీద మరోసారి వివరణ ఇచ్చారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ… కాబోయే సీఎం తానే అనేది వాస్తవం కాదన్నారు. మరో పదేళ్లపాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటారనీ, ఆ మాటను ఆయనే స్వయంగా అసెంబ్లీ సాక్షిగా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. కేటీఆరే సీఎం అంటూ మళ్లీ ప్రచారం చేస్తుండటం భావ్యం కాదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈవారంలో సమావేశం జరుగుతుందనీ, మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం మార్గదర్శకత్వం చేస్తారని కేటీఆర్ చెప్పారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని అమలు చేయడమే తన ముందున్న లక్ష్యం అన్నారు. చట్టం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే కౌన్సిలర్లపై చర్యలుంటాయన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధిస్తుందని, 2020 నుంచి 2030 వరకూ రాబోయే దశకం తెరాస పార్టీదే అన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డి వదులుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై స్పందిస్తూ… అది ఆయన వ్యక్తిగత అంశమన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎప్పుడూ తక్కువగా చూడ్డానికి వీల్లేదనీ, ఆ పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. భాజపా గురించి మాట్లాడుతూ… తాను చిన్నప్పుడు ఎలా అయితే భాజపాని చూశానో, ఇప్పుడూ అలానే ఉందని ఎద్దేవా చేశారు.
కాబోయే సీఎం కేటీఆర్ అనగానే… పార్టీ వర్గాల్లో మళ్లీ వారసత్వ చర్చ ఈ మధ్య తెరమీదికి వచ్చిందని సమాచారం. కేసీఆర్ తరువాత సీఎం అయ్యే అర్హతలు కేటీఆర్ తోపాటు, మంత్రి హరీష్ రావుకీ ఉన్నాయనీ, ఆయనేం తక్కువ కాదంటూ అర్హతల బేరీజు వేసుకునే చర్చ గులాబీ దళంలో కొద్దిరోజులుగా మొదలైందట. ఈ చర్చను ఇక్కడితో ఆపకపోతే ఇది మరోసారి తలనొప్పి కారణం అవుతుంది. అందుకే, దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేద్దామని మంత్రి కేటీఆర్ ఇలా స్పందించినట్టుగా భావించొచ్చు. ఒకటైతే వాస్తవం… కేసీఆర్ రాజకీయ వారసుడి చర్చ ఏ రూపంలో తెర మీదికి వచ్చినా… కేటీఆర్ కి సమాన స్థాయిలో హరీష్ రావు పేరు అప్పుడూ ఇప్పుడూ వినిపిస్తూనే ఉంది.