తెలంగాణ మంత్రి కేటీఆర్ సందర్భం వచ్చినప్పుడల్లా అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే… పక్క రాష్ట్రాలను చూపించడం కామన్ గా మారుతోంది. గతంలో పొరుగురాష్ట్రాన్ని ఆయన నరకంగా అభివర్ణించారు. ఈ వ్యవహారం సంచలనం సృష్టించింది. మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. కానీ అంత డోస్ లో కాదు. కాస్త తగ్గించారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి గురించి అంచనాకు రావాలంటే.. పొరుగు రాష్ట్రాలను పరిశీలించి రావాలని చెబుతున్నారు.
హైదరాబాద్లో స్వచ్చ సర్వేక్షణ్ అవార్డులు తెలంగాణకు భారీగా రావడంపై అధికారులతో ఓ కార్యక్రమం జరిగింది. ఇందులో కేటీఆర్ ప్రసగించారు. బీఆర్ఎస్ హయాంలో భారీగా అభివృద్ధి జరిగిందని చెప్పారు. అయితే ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పుకోవాలంటే పోలిక ఉండాలి కాబట్టి పక్క రాష్ట్రాన్ని చూపించారు. ఆ రాష్ట్రం వెళ్లి చూసి వస్తే తేడా తెలుస్తుందన్నారు. కేటీఆర్ చెప్పే పక్క రాష్ట్రంలో రోడ్లపై గుంతలు కూడా పూడ్చడం లేదన్న విమర్శలు ఎప్పట్నుంచో ఉ్ననాయి. ఆ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ భారీ అభివృద్ధి జరిగిందని ఎవరైనా అనుకోవడం సహజమే.
అయితే ఆ పక్క రాష్ట్రం అధికార పార్టీ … బీఆర్ఎస్ నేతలకు సన్నిహితమైనది. పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం సహకరించుకుంటూ ఉంటారు. ఆ పక్క రాష్ట్రం నేతలు తెలంగాణలో జరుగుతున్న వ్యవహారాలపై అసలు ఎలాంటి కామెంట్లు చేయరు. కానీ కేటీఆర్ మాత్రం ఎప్పుడూ.. ఆ రాష్ట్రంలో పరిస్థితులపై భిన్నంగా స్పందిస్తూనే ఉంటారు.