మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం తరువాత.. మరోసారి రెండు జాతీయ పార్టీలను లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఫెడరల్ ప్రభుత్వం ఆవశ్యకత దేశానికి ఉందని కూడా ఆయన చెప్పారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడారు. మొత్తం 127 మున్సిపాలిటీల్లో 119 కైవసం చేసుకున్నామనీ, ఇతర పార్టీలకు అందనంత దూరంగా తెరాస ఉందని కేటీఆర్ అన్నారు. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటింగ్ గురించి మాట్లాడుతూ… ఉన్నదాన్నే వాడుకున్నామనీ, దీన్లో తప్పేముందన్నారు. వారి ఓటును వినియోగించుకునే అవకాశం చట్టబద్ధంగా పార్టీకి ఉంది కదా అన్నారు. రెబెల్స్ గురించి మాట్లాడుతూ… అలాంటివారు కొన్ని చోట్ల గెలిచినా, వారి అవసరం లేకుండానే కొన్ని మున్సిపాలిటీలు కైవసం చేసుకున్నామన్నారు.
మా ప్రత్యర్థులు చాలా చోట్ల తిప్పలుపడ్డారనీ, చాలా చోట్ల కుమ్మక్కయ్యారన్నారు కేటీఆర్. కాంగ్రెస్, భాజపాలు కలిసి స్థానాలు పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మక్తల్ లో భాజపా ఛైర్మన్ అయితే, కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందనీ, మణికొండలో భాజపాకి ఛైర్మన్, కాంగ్రెస్ కి ఉపాధ్యక్ష పదవి, తుర్కయాంజల్ లో కూడా ఇలానే సర్దుకున్నారన్నారు. పేరుకేమో ఢిల్లీ పార్టీలు, చేసేవన్నీ సిల్లీ పనులు అన్నారు. జాతీయ పార్టీలైన ఈ రెండూ, ఒక ప్రాంతీయ పార్టీ తెరాసను ఎదుర్కొనలేకపోయాయన్నారు. ఇదొక అపవిత్ర అవగాహన అని ముందే చెప్పామనీ, ఇప్పుడు అదే బయటపడిందన్నారు. మొన్నటిదాకా టీడీపీ – కాంగ్రెస్ కలిశాయనీ, ఇప్పుడు కాంగ్రెస్ – భాజపా కలిశాయన్నారు. తెరాస దెబ్బకు ఈ చిత్రాలు చూస్తున్నామన్నారు. ఒకరేమో తమను కాంగ్రెస్ ఏజెంట్ అంటారనీ, మరొకరు మేం భాజపా బీ టీమ్ అంటారనీ.. ఇవాళ్ల ఎవరు ఎవరికి ఏజెంటో తేలిందన్నారు. ఆ రెండు పార్టీలు కండువాలు మార్చుకోవాలన్నారు. ఒక మున్సిపాలిటీ కోసం రెండు జాతీయ పార్టీలు పాకులాడే పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీలో తు కిత్తా మే కిత్తా అని అరుచుకునే పార్టీలు ఇవాళ్ల తెరాస దెబ్బకి ఫెవిక్విక్ బంధం పెట్టుకున్నాయన్నారు.
కాంగ్రెస్, భాజపా… సమీప భవిష్యత్తులో ఈ రెండు పార్టీలూ మేం వేర్వేరు అని బలంగా చెప్పుకుంటే తప్ప తెలంగాణ ప్రజలు నమ్మరు అనే స్థాయిలో కేటీఆర్ విమర్శించారు. పనిలోపనిగా జాతీయ పార్టీలు రెండూ తెలంగాణకు అవసరం లేదన్నది కూడా అదే స్థాయిలో బలంగా చెబుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల కలకు అనుగుణంగా… తాజా పరిస్థితిని కేటీఆర్ మార్చి విశ్లేషించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు.