ఎంతో తెలివైనవాళ్లు కూడా ఒక్కోసారి కాస్త తిక్కగా మాట్లాడతారు. ఇలా తిక్కగా మాట్లాడటం తెలియక కాదు, తెలిసే మాట్లాడతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కమ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చాలా తెలివైనోడు. మంచి మాటకారి. పరిపాలనలో సమర్థుడు. కాని ఏపీ రాజధాని వ్యవహారంలో తిక్కగా మాట్లాడాడు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేసీఆర్ శిష్యుడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు జగన్‌కు కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారని కొందరు అంటూవుంటారు. అందులో నిజానిజాలు ఎలా ఉన్నా కొన్ని విషయాల్లో కేసీఆర్ సలహాలు తీసుకుంటారనేది వాస్తవం కావొచ్చు.
చంద్రబాబుతో పొట్టుపొట్టుగా పెట్టుకున్న కేసీఆర్ యువ ముఖ్యమంత్రిని మాత్రం అక్కున చేర్చుకుంటున్నారు. వయసులో, అనుభవంలో తన కన్నా చిన్నవాడు కావడం, చంద్రబాబుకు శత్రువు కావడం ఇందుకు కారణాలు కావొచ్చు. తండ్రికి జగన్ శిష్యుడైనప్పుడు కేటీఆర్‌కు జిగ్రీ దోస్తవుతాడు కదా. అందుకే జగన్ ఏం చేసినా సమర్థించడం మామూలే. అలా సమర్థించినప్పుడు లేదా వత్తాస్తు పలికినప్పుడు తిక్క మాటలొస్తాయి. కేటీఆర్ అంత తిక్కగా, అర్థంపర్థం లేకుండా ఏమన్నాడు? ఇదివరకోసారి ఏపీ రాజధాని రచ్చ గురించి మీడియా ప్రశ్నించినప్పుడు అది వారి అంతర్గత వ్యవహారమని, ఏపీ ప్రజలు చూసుకుంటారని చక్కగా సమాధానమిచ్చాడు కేటీఆర్.
తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఏపీలో రాజధాని మారుస్తామంటే ఆందోళనలు చేస్తున్నారు. తెలంగాణలో చిన్న ఆందోళన లేకుండా జిల్లాల విభజన చేశాం” అన్నాడు. “ఏపీలో రాజధాని మార్పుపై ఇంత ఆందోళన, వ్యతిరేకత ఎందుకు వస్తున్నదో ఆలోచించాల్సిన అవసరం ఉంది” అన్నాడు కేటీఆర్. తెలంగాణ ప్రజలు శాంతికాముకులని, తాము ఏం చేసినా ఇక్కడి జనం గొడవలు చేయరని చెప్పాడన్నమాట. జగన్ మంచి పని చేస్తుంటే ఏపీ జనం అనవసరంగా గొడవ చేస్తున్నారని మంత్రి ఉద్దేశం కావొచ్చు. జగన్ తనకు ఫ్రెండ్ కాబట్టి ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తున్నాడు. కేటీఆర్ దృష్టిలో జిల్లాల విభజన, రాజధాని విభజన ఒకటేనన్నమాట.
రెండింటికీ తేడా లేదు. తెలంగాణలో జిల్లాల విభజనప్పుడు ప్రజలు గొడవ చేయలేదు. ఇంకా జిల్లాలు విభజించాలని డిమాండ్ చేశారు కూడా. పది జిల్లాల తెలంగాణ చివరకు 33 జిల్లాల రాష్ట్రమైంది. జిల్లాలు విభజించినప్పుడు అందుకు కేసీఆర్ చెప్పిన కారణం కేంద్రం నుంచి నిధులు వస్తాయని. కేంద్రం జిల్లాను యూనిట్‌గా తీసుకొని నిధులు ఇస్తుంది కాబట్టి ఎన్ని ఎక్కువ జిల్లాలుంటే అంత మంచిదన్నారు. టీఆర్ఎస్ నాయకులకు పార్టీపరంగా పదవులు ఇచ్చేందుకు కూడా జిల్లాల విభజన ఉపయోగపడుతుందని అనుకున్నారు. జిల్లాలు చిన్నగా ఉంటే పరిపాలన ప్రజలకు చేరువైతుందన్నారు. మరి ఈ లక్ష్యాల్లో రాజకీయ లక్ష్యాలు నెరవేరి ఉంటాయి. కేంద్రం నుంచి జిల్లాలవారీగా నిధులు వస్తున్నాయో లేదో తెలియదు.
జిల్లాల విభజన అనేది పూర్తిగా రాప్ణ్ర వ్యవహారం. కేంద్రంతో దీనికి సంబంధం లేదు. వంద జిల్లాలు చేసుకున్నా కేంద్రం ఏమీ అనదు. జిల్లాలతో సంబంధమున్న కేంద్ర చట్టమేదీ లేదు. కాని ఏపీ రాజధాని వ్యవహారం అలా కాదు కదా. అది విభజన చట్టం ద్వారా ఏర్పడిన రాష్ట్రం. ఉమ్మడి ఏపీని కేంద్రం చట్టం ద్వారా విడగొట్టింది. కేంద్రంతో సంబంధం ఉంది. రాజధాని నిర్మాణానికి రైతులు భూములిచ్చారు. అమరావతిలో కొంతమేరకు నిర్మాణాలు జరిగాయి. రాజధాని మార్పు అంటే ఇది మొత్తం రాజధానిని తరలించడం కాదు. అసెంబ్లీ అమరావతిలో, సచివాలయం విశాఖపట్టణంలో, హైకోర్టు కర్నూలులో ఉంటుందని జగన్ చెప్పారు.
రాజధానిని ఇలా ముక్కలు చేసినప్పుడు జనం గొడవ చేయకుండా, ఆందోళన చెందకుండా ఎలా ఉంటారు? ఇది చాలా అంశాలతో ముడిపడి వున్న వ్యవహారం. జిల్లాలను విభజస్తే జనం గొడవ చేయలేదని కేటీఆర్ గొప్పగా చెబుతున్నాడు. హైదరాబాదును మూడు నాలుగు ముక్కలు చేస్తే జనం గోల పెడతారో, స్వాగతిస్తారో తెలుస్తుంది. తెలంగాణకు రాజధాని వడ్డించిన విస్తరిలా ఉంది కాబట్టి ఏ సమస్యలూ లేవు.