తెలంగాణకు వచ్చి టీఆర్ఎస్ పై విరుచుకుపడిన బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డాకు… ఒక్క టీఆర్ఎస్ వైపు నుంచి మాత్రమే కాదు.. టీడీపీ, కాంగ్రెస్ నుంచి కూడా.. ఘాటుగా కౌంటర్లు వచ్చి పడ్డాయి. టీఆర్ఎస్ను.. టార్గెట్ చేసుకుని నడ్డా చేసిన విమర్శలు.. ఆ పార్టీ అగ్రనేతలను సహజంగానే ఆగ్రహానికి గురి చేశాయి. సోమవారమే.. కూకట్‌పల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఉండటం..దానికి కేటీఆర్ హాజరు కావడంతో.. బీజేపీకి కౌంటర్ ఘాటుగానే ఉంటుందని అందరూ అనుకున్నారు. దానికి తగ్గట్లుగానే…కేటీఆర్.. నడ్డాపై చెలరేగిపోయారు. జేపీ నడ్డా కాదు…పచ్చి అబద్ధాల అడ్డా అని సెటైర్ వేశారు. తెలంగాణలో కర్ణాటక తరహా రాజకీయాలు నడవవని తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కేంద్రసంస్థలను .. నీతి ఆయోగ్ ఎందుకు ప్రశంసిస్తుందో అడిగి తెలుసుని మాట్లాడాలని.. అడ్డగోలుగా మాట్లాడటానికి నడ్డాకు సిగ్గనిపించటం లేద అని తీవ్రంగా ప్రశ్నించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి… ఆ చలిమంటల్లో రాజకీయాలు చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నేత నడ్డా విమర్శించించి టీఆర్ఎస్ ను కాబట్టి.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కానీ… అనూహ్యంగా.. కాంగ్రెస్ ,టీడీపీ నేతలు కూడా… జేపీ నడ్డాపై మండిపడ్డారు. అయితే.. వీరి యాంగిల్ వేరు. టీఆర్ఎస్ పై అంత తీవ్రంగా విమర్శలు చేసిన.. జేపీ నడ్డా…. కేంద్రంలో ఉన్న అధికార పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. తల్చుకుంటే ఏమైనా చేయగలరన్న ఉద్దేశంతో.. ఆయన చేసిన ఆరోపణలపై విచారణ జరిపించే దమ్ముందా.. అని టీడీపీ, కాంగ్రెస్ నేతలు సవాళ్లు చేశారు. తెలంగాణలో ఎంతో అవినీతి జరిగిందని… నడ్డా ఆరోపించారు. అలా అయితే.. విచారణ ఎందుకు వేయరని.. టీడీపీ, కాంగ్రెస్ సూటిగానే ప్రశ్నిస్తున్నాయి. టీఆర్ఎస్ అవినీతిపై కేంద్ర సంస్థలతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నేత సంపత్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై మాట్లాడేందుకు .. గతంలో నాగం జనార్ధన్‌రెడ్డికి బీజేపీ అనుమతి ఇవ్వలేదని గుర్తు చేశారు. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇదే రీతిలో స్పందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీకి. కేంద్రసంస్థలతో దర్యాప్తు చేయించే దమ్ముందా అని ప్రశ్నించారు.
బీజేపీ నేతలు… టీఆర్ఎస్ పై దూకుడుగా వెళ్తున్నారు కానీ.. అది రాజకీయం కోసమే అన్నట్లుగా ఉండటం.. వారికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. అవినీతి ఆరోపణలు చేస్తున్నప్పుడు.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా విచారణ జరిపించాలన్న డిమాండ్ ను… ఇతర పార్టీల నేతలు గట్టిగానే వినిపిస్తున్నారు. దీనిపై బీజేపీ నీళ్లు నమలడం తప్ప.. ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. ఇతరుల దృష్టిలో బీజేపీ నేతలు.. కేవలం ఆరోపణలు చేస్తున్నారన్న భావన పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ .. బీజేపీ ఆరోపణలను తాను డిఫెండ్ చేసుకుంటోంది.. ఇతర పార్టీలు.. బీజేపీ పై చేస్తున్న ఎటాక్ తో టీఆర్ఎస్కు కూడా.. రివర్స్ యాంగిల్ లో అయినా ప్రయోజనమే కలుగుతోంది.