ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట సభలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు వ్యతిరేకం అని ఆరోపించే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు చట్ట వ్యతిరేకమనీ, దీనికి పర్యావరణ అనుమతులు రద్దు చెయ్యాలనీ అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు కేటీఆర్. ఎండిపోయిన పాలమూరు గొంతు తడిపే ప్రయత్నం కేసీఆర్ చేస్తే… ఆ పాలమూరు అక్రమ ప్రాజెక్టు, దీనికి అనుమతి ఇవ్వొద్దూ అంటూ కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారన్నారు. ఖమ్మం జిల్లాలో గోదావరి మీద సీతారామ ప్రాజెక్టు కూడా అక్రమమనీ, దీనికి కూడా పర్మిషన్ ఇవ్వొదన్నారని చెప్పారు.
‘ఒకవేళ, పొరపాటునో ప్రజల గ్రహపాటునో ఈ మహా కూటమి.. వచ్చేది లేదు, చచ్చేది లేదుగానీ.. అధికారంలోకి వచ్చిందే అనుకోండి! కాంగ్రెస్, తెలుగుదేశం కలిసి అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టు ఏమైతయి..? చెయ్యొద్దూ అని చంద్రబాబే ఉత్తరాలు రాస్తున్నారు, మరి, అదే చంద్రబాబు చేతిలో రేపు గవర్నమెంట్ ఉంటే… అయితాయా ప్రాజెక్టులు, రైతులకు నీళ్లు వస్తయా..?’ అంటూ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని కూడా ఎద్దేవా చేశారు. తనకంటే బాగా పనిచేసే అభ్యర్థులు తెలుగుదేశం, కాంగ్రెస్, వేరే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తున్నా… వారికి ప్రజలు ఓటెయ్యొచ్చన్నారు. కష్టపడి పనిచేశాను కాబట్టే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా అన్నారు.
కొన్నాళ్ల కిందట… ఇదే కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మెచ్చుకున్నారు! హైదరాబాద్ ఐటీ రంగం ఈరోజున ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే దానికి చంద్రబాబు నాయుడు చేసి కృషే కారణమన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్ర ఎప్పటికీ ఉంటుందన్నారు! ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి… ఇలా ఆరోపణలు మొదలుపెట్టారు కేటీఆర్. టీడీపీని తెలంగాణ వ్యతిరేక పార్టీగానూ, చంద్రబాబును రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగానూ ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు మంత్రి కేటీఆర్. చంద్రబాబు చేతిలో అధికారం పెడితే… ప్రాజెక్టులు పూర్తి కావనే భయాన్ని ప్రజలకు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు! ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వచ్చినా… కాంగ్రెస్ పార్టీ ఇక్కడి ప్రభుత్వాన్ని నడుపుతుంది, టీడీపీకి ఆ స్థాయి నిర్ణయాధికారం ఉంటుందా..? రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికీ టీడీపీ కట్టుబడి ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
ప్రత్యేకంగా రైతులు పాయింటాఫ్ వ్యూ నుంచి, సాగునీటి ప్రాజెక్టుల ప్రస్థావన తీసుకొచ్చి చంద్రబాబుపై కేటీఆర్ విమర్శలకు మరో నేపథ్యం కూడా కనిపిస్తోంది. ఇటీవలే బాబ్లీ ప్రాజెక్టు పోరాటం మరోసారి తెరమీదికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలో కొన్ని జిల్లాలు ఎండిపోతాయనీ, ఆ పరిస్థితి రాకూడదని చంద్రబాబు నాడు పోరాటం చేశారు. ఆ అంశం ఇప్పుడు ప్రజల్లో చర్చనీయం అవుతున్న సంగతి తెలిసిందే. దీంతో, తెలంగాణ రైతాంగం టీడీపీ వైపు తొంగి చూస్తుందన్న ఆలోచన తెరాసకు ఉండే ఉంటుంది! ఫలితమే కేటీఆర్ వ్యాఖ్యలూ అనుకోవచ్చు.