మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ రాహుల్ గాంధీని టార్గెట్ చేయాలనుకున్నారు. అందుకే నేషనల్ మీడియాను పెద్ద సంఖ్యలోనే ఆహ్వానించి… రాహుల్ జీ మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నీతులు చెప్తున్నారు, మీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ఫిరాయింపులు చేస్తున్నారు గమనించటం లేదా అని ప్రశ్నించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా… గతంలో మీరు కూడా ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కదా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా, మేం ఎమ్మెల్యేలను చేర్చుకోలేదు… విలీనం చేసుకున్నాం. విలీనం వేరు… ఫిరాయింపులు వేరు అని సమాధానం ఇచ్చారు.
నిజానికి తెలంగాణలో ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చాక… టీడీపీ గుర్తు మీద గెలిచిన తలసానికి మంత్రి పదవి ఇచ్చారు. విలీనం ప్రక్రియ పూర్తి చేశారు.
విలీనం వేరు… ఫిరాయింపులు వేరు… ఫిరాయింపులపై స్పీకర్ కు ఫిర్యాదు చేసినా, విలీనం ప్రక్రియ తెరమీదకు వచ్చే వరకు పెండింగ్ లో పెట్టిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు కూడా ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరుతుండటంతో… బీఆర్ఎస్ ఎల్పీ విలీనంపైనే రేవంత్ టీం ఫోకస్ చేసింది. త్వరలో విలీనం కూడా అవుతుందని కాంగ్రెస్ నేతలు ధీమాగా చెప్తున్నారు. ఇంకా కొద్దిరోజులే ఫిరాయింపులు అని చెప్తారని, విలీనం ప్రక్రియనే తాము పూర్తి చేయబోతున్నాము అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే, మూడు నెలల్లోపు తేల్చాల్సిందేనంటూ బీఆర్ఎస్ కొత్త వాదన తెరపైకి తెచ్చినా, స్పీకర్ కోర్టులో ఉన్న బాల్ పై హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందా? అన్న సంగతి చూడాలి.