కవితను జైలు నుంచి బయటకు తీసుకు వచ్చే టాస్క్ మీద ఢిల్లీకి వెళ్లిన కేటీఆర్, హరీష్ రావు ఐదు రోజుల తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ తెలుగు మీడియాకు కాదు. ప్రధానంగా జాతీయ మీడియాను పిలిచారు. తెలుగు మీడియా కూడా వచ్చింది కానీ.. ఎక్కువగా జాతీయ మీడియానే కవర్ చేసేలా చూసుకున్నారు.
ప్రెస్ మీట్లో కేటీఆర్ ప్రధానంగా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. బీజేపీపై ఏ విషయంలో రాహుల్ విమర్శలు చేస్తూంటారో వాటినే హైలెట్ చేసుకున్నారు. ఇటీవల రాహుల్ రాజ్యాంగం మిని బుక్ ను చేతిలో పెట్టుకుని బీజేపీని విమర్శిస్తూ వస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కూడా.. ఫిరాయింపుల విషయంలో తాను రాజ్యాంగం బుక్ ను పంపిస్తానని రాహుల్ కు సవాల్ చేశారు. ఇంకా కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. జాతీ.య మీడియా ప్రతినిధులకు ఈ విషయంలో ఓ స్పష్టత వచ్చింది. బీజేపీని ఇంప్రెస్ చేయడానికి కేటీఆర్ గట్టిగా ప్రయత్నించారని అర్థమైపోయింది.
కేంద్రంలో బీజేపీ పాలనపై కేటీఆర్, హరీష్ రావు నోరెత్తలేదు. మోదీని విమర్శించలేదు. అలాంటి ప్రయత్నం చేయలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు. కానీ గత పదేళ్లుగా కాంగ్రెస్ పై గెలిచిన ప్రతి ఒక్కరిని బీఆర్ఎస్ లో చేర్చుకున్నది మీరే కదా అని జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ వద్ద సమాధానం లేకపోయింది. ఇవన్నీ కేటీఆర్ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కాంగ్రెస్ ను టార్గెట్ చేసిన విధానం బీజేపీ పెద్దల్ని మెప్పించిందా లేదా అన్నదే ఆయన టార్గెట్.