ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ నేతలు చాలా సంతోషంగా ఉన్నారు. కేటీఆర్ అయితే సెటైర్లతో విరుచుకుపడ్డారు. రాహుల్, రేవంత్ లను బిగ్ జీరోలు అని వెంటకారం చేశారు. ఆయన ఆనందం చూసి ఇతర బీఆర్ఎస్ క్యాడర్ కూడా కేరింతలు వేశారు. కానీ కేటీఆర్‌ది అంతా రేవంత్ పై వ్యతిరేకత. అది వ్యతిరేకత స్థాయి నుంచి ఎక్కడికో పెరిగిపోయింది. అయితే కాస్త ముందుచూపుతో ఆలోచిస్తే.. తమకు అసలు ముప్పు బీజేపీ నుంచే వస్తోందని.. బీజేపీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడం తొందరపాటు తనం అవుతుందని మాత్రం అంచనా వేయడానికి కేటీఆర్ ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు.
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ క్రమంగా విస్తరిస్తోంది. ఆ పార్టీ వైపు ఆకర్షితులవుతున్న ప్రతి ఒక్క ఓటరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకును బీజేపీ సగానికిపైగా కైవసం చేసుకుంది. ఫలితంగా బీఆర్ఎస్ డిపాజిట్లను కోల్పోయింది.అయినా ఇప్పటికీ బీజేపీకి ఎదురు పడి రాజకీయాలు చేయలేకపోతున్నారు . ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం పోటీకి దూరంగా ఉన్నారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలలోనూ ఇదే పరిస్థితి రిపీట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అంటే క్రమంగా కొద్ది కొద్దిగా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ ఆక్రమిస్తోంది.
ఈ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. దానికి వారికి ఉండే కారణాలు వారికి ఉండవచ్చు కానీ.. వ్యక్తుల్ని ట్రోల్ చేయడం ద్వారా సాధించేదేమీ ఉండదు. కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మరే పార్టీ లేనప్పుడు ఎదురుగా బీఆర్ఎస్ మాత్రమే ఉన్నప్పుడు ఇలాంటివి వర్కవుట్ అవుతాయి. కానీ భారతీయజనతా పార్టీ అనే రాజకీయ దిగ్గజం ముందు.. మోదీ, షాలనే వ్యూహకర్తలు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు వారికి పరోక్షంగా సపోర్టు చేసుకుంటూ పోతే నష్టపోయేది బీఆర్ఎస్సే. తెలంగాణ ప్రభుత్వానికి ఇంకా మూడున్నరేళ్ల సపోర్టు ఉంది. బీజేపీ ఇంకా తనదైన రాజకీయం ప్రారంభించలేదు. ప్రారంభించిన రోజున ఆ పార్టీ మొదట టార్గెట్ చేసేది బీఆర్ఎస్ పార్టీనే. ఇప్పటికే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తి చేశారని అనుకోవచ్చు.