తెలంగాణ మంత్రి, యువ నాయకుడు కె.తారకరామారావు వారసత్వ రాజకీయాలను తాను బలపర్చనని చెప్పడం ఆయన భావమై వుండొచ్చుగాని ఇప్పుడాయన ఉన్న స్థితికి పెద్దగా పొసగదు. ఉద్యమంలో పాల్గొనడం, ఎన్నికల్లో గెలవడం, విశ్లేషణల్లో చర్చల్లో పాల్గొనడం, ఐటి, ఎన్నికల ప్రచార బాధ్యతలు చేసిన మాట నిజమే. విమర్శలు వున్నా బాగానే చేస్తున్నారని భావించేవారు ఎక్కువగానే వున్నారు.వీటికి బలం చాలావరకూ వారసత్వంలో వున్నదనేది కూడా కాదనలేని సత్యం. రాముతో మాట్లాడండి అన్నది ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో అలవాటైన మాటగా చెప్పుకుంటున్నారంటే దానికి కుటుంబ నేపథ్యం ప్రధాన పాత్ర వహిస్తుుంది. ఇది టిఆర్ఎస్లోనే కాదు, దేశమంతటా అన్ని పాలకపార్టీలలో వున్నదే గనక ప్రత్యేకించి తప్పుపట్టే పరిస్థితి లేదు. కాని ఇప్పటికే వారసత్వ నిర్ణయం జరిగిపోయిందనే భావం బలంగా వుండగా కెటిఆర్ మాటలు రాజకీయ వర్గాలు లాంఛనప్రాయమైనవిగానే తీసుకుంటాయి. నిజంగా ఆయనకు అలాటి భావమే వుండివుంటే మొదటినుంచి మరింత జాగ్రత్త పాటించి వుండాల్సింది. ఇప్పటికైనా ఆ అవకాశం వుంది. అలాగాక ఒకవైపున యువరాజ పట్టాభిషేకం మరోవైపున వారసత్వంపై వైముఖ్యం ఎలా కుదరుతుంది?
కెసిఆర్ దీర్ఘకాలం నాయకత్వం కొనసాగించాలనే అందరూ కోరుకుంటారు. పంజాబ్‌లో ప్రకాశ్ సింగ్ బాదల్, కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడులో కరుణానిధి వంటివారు కుమారులకు పూర్తి అవకాశం ఇవ్వకుండా చేస్తున్నారని ఈ మధ్యనే ఎవరో వ్యాఖ్యానించారు. ఇందుకు భిన్నంగా యుపిలో ములాయం సింగ్ అఖిలేష్‌కు ఏకంగా పగ్గాలిచ్చేశారు. అది చూసి లోకేశ్‌ను కూడా అలాగే చేయాలని చంద్రబాబు నాయుడు మరింత ఉత్సాహపడ్డారు. ఈ విషయంలో కెసిఆర్ కెటిఆర్ వ్యూహం ఎలా వుంటుందో వుందో తెలియదు గాని వారసత్వ ముద్ర మాత్రం తేలిగ్గా తొలగేది కాదు.. బహుశా అది లేకుంటే జరగదు కూడా.