భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మీద విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… 3148 వార్డులు, డివిజన్లకు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే తెరాస తరఫున ఎనిమిది వేల తొమ్మిది వందల మంది నామినేషన్లు వేశారన్నారు. అంటే, ఒక్కొక్క వార్డుకూ ముగ్గురేసి చొప్పున పోటీ పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ బాగా ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు కదా అని చూస్తే… పాపం, బీ-ఫామ్ లు ఇద్దామన్నా కూడా 800 చోట్ల కాంగ్రెస్ కి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. భాజపా సంగతి చెప్పాల్సిన పనే లేదనీ, అడ్డిమారి గుడ్డిదెబ్బ అన్నట్టుగా నాలుగు ఎంపీ సీట్లు వచ్చాయన్నారు. దానికే ఎగిరెగిరి పడుతూ… మేమే ప్రత్యామ్నాయం మేమే ప్రత్యామ్నాయం అన్నారన్నారు.
రేపు కేసీఆర్ దిగిపోతున్నట్టు, ఎల్లుండి మేమే కూర్చుంటామంటూ లచ్చన్న ఒకటే గోల అన్నారు. భాజపా వాళ్లకి కూడా దాదాపు 700 చోట్ల అభ్యర్థులు దొరకలేదన్నారు. కాంగ్రెస్, భాజపా ఇద్దరూ కలిసి చూస్తే… 1200 స్థానాల్లో వాళ్లకీ అభ్యర్థులు లేని పరిస్థితి అన్నారు. చివరికి ఇవాళ్ల ఏం తేలిందీ, తొంబై రెండు శాతం స్థానాలు తెరాస గెలుచుకుందన్నారు. ఎన్నికలు అంతా అయిపోయాక కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, లక్ష్మణ్ ప్రకటనలు చూస్తుంటే తనకు అర్థం కావడం లేదన్నారు! డబ్బులతో కొనేసి ఓట్లేయించుకున్నారు అంటూ తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారు అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎమ్ ల మీద అనుమానముందని ఉత్తమ్ చెప్పారనీ, ఇప్పుడేమో కొత్తగా న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదనీ, ఈసీ మీద నమ్మకం లేదనీ, ప్రజాస్వామ్యం మీదే నమ్మకం పోయిందని అంటున్నారనీ, వాస్తవం ఏంటంటే ఆయన మీద ప్రజలకే నమ్మకం పోయిందన్నారు. ఇక నువ్వు అన్నీ చాలించుకుని ఇంట్లో కూర్చోమని ప్రజలు చెప్తున్నారన్నారు.
వరుసగా ఇది రెండోసారి… కాంగ్రెస్, భాజపాలపై తీవ్ర విమర్శలు చేయడం. ఆ రెండు పార్టీలు సంఖ్యాపరంగా గెలుచుకున్న స్థానాలు తక్కువే ఉన్నా… ఓటింగ్ శాతం చూసుకుంటే కాంగ్రెస్ రెండో స్థానంలో, ఆ తరువాత భాజపా ఉన్నాయి. కొన్ని చోట్ల భాజపాకి ఓటింగ్ బాగానే పెరిగింది. ఏమీ ఉండదూ అనుకున్న కాంగ్రెస్ కూడా గట్టిపోనే ఇచ్చింది. అయితే, ఆ రెండు పార్టీలూ ఫలితాలను ఈ కోణం నుంచి ప్రజల్లోకి, సొంత కేడర్లోకి తీసుకెళ్లే లోపే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు కేటీఆర్. మానసికంగా రెండు పార్టీల శ్రేణుల్ని మరింత బలహీన పరిచే ప్రయత్నంగానూ ఈ వ్యాఖ్యల్ని చూడొచ్చు.