ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు ప్రశ్నలు గుప్పిచిన తర్వాత కేటీఆర్ బయటకు వచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకుంటారన్న అనుమానం బీఆర్ఎస్ నేతలకు ఉండటంతో తెలంగాణ భవన్ తో పాటు ఏసీబీ ఆఫీసు వద్ద కూడా భారీగా కార్యకర్తల్ని మోహరించారు. అయితే ఏడు గంటల విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చారు. అక్కడే మీడియాతో మాట్లాడారు.
అవినీతి లేని కేసులో అధికారులు నాలుగు ప్రశ్నల్నే తిప్పి తిప్పి నలభై సార్లు అడుగుతున్నారని ఆరోపించారు. అవి కూడా రేవంత్ రెడ్డి రాసిచ్చినవేనన్నారు. తనకు అవగాహన ఉన్నంత వరకు ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పానని .. ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని స్పష్టం చేశారు.
ఏసీబీ ఆఫీస్ ఎదుట మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఏసీబీ ఆఫీస్ ముందు మాట్లాడేందుకు మీడియా పాయింట్ లేదని ట్రాఫిక్ జామ్ అవుతుందని వెళ్లిపోవాలనని కోరారు.
ఇక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పేమిటని పోలీసు అధికారిపై మండిపడ్డారు. మీ పార్టీ ఆఫీస్కు వెళ్లి మాట్లాడుకోవాలని అధికారులు సూచించారు. తమ డ్యూటీ తాము చేస్తున్నామని చెప్పడంతో కేటీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంక్రాంతి తర్వాత ఆయన్ని రెండోసారి పిలిచి ప్రశ్నించే ఛాన్స్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.